
రూ.1500 కోట్ల భూమి ఆక్రమణ
* దుర్గం చెరువును పరిశీలించిన అంచనాల కమిటీ
* వివరాలను వెల్లడించిన చైర్మన్ రామలింగారెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ప్రాంతంలో రూ.1,500 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైందని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను అంచనాల కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రామలింగారెడ్డి మాట్లాడుతూ దుర్గం చెరువు పరిసరాల్లోని 60 ఎకరాల విలువైన భూమి అన్యాక్రాంతమైందన్నారు. చెరువు, శిఖం భూములను ఆక్రమించిన వాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. ప్రాథమిక సర్వే చేసిన తర్వాత ప్రభుత్వానికి ఆక్రమణలపై నివేదిక ఇస్తామన్నారు.
దుర్గం చెరువు పరిశీలన
దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను అంచనాల కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, వీరేశం, డి.కె.అరుణ, అంజయ్య, ప్రభాకర్‌రావు, కృష్ణారావు, జనార్ధన్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ చైర్మన్ శాలిని మిశ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పరిశీలించారు.
ఆక్రమణల వివరాలతో కూడిన ప్రదర్శన...
దుర్గం చెరువు పరిసర ప్రాంతాలను, వాటి నమూనాలను, ఆక్రమణలతో కూడిన వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను అంచనాల కమిటీ సభ్యులు తిలకించారు. కాగా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే అమర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ(హుడా అప్రూవ్డ్ లే అవుట్), కావూరి హిల్స్ (హుడా అప్రూవ్డ్ లే అవుట్), ఎస్టీపీ పక్కన, ఓరుగంటి నర్సింహ్మ లే అవుట్, కల్యాణ్ నగర్, బృందావన్‌కాలనీ, నెక్టార్ గార్డెన్, గఫూర్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయని ప్రదర్శనలో పేర్కొన్నారు. ఈ కాలనీ వివరాలను సభ్యులు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.