ముంబై: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు ప్రపంచ కరెన్సీలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వరుసగా మూడో రోజు దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ తో పోలిస్తే మరింత దిగజారింది 16 పైసలు క్షీణించి 67.21 వద్ద నేలచూపులు చూస్తోంది. రూపాయి విలువ దాదాపు మూడు వారాల కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 13 పైసలు క్షీణించి 67.18 వద్ద ట్రేడవుతోంది. ఇది మూడు వారాల కనిష్టంకాగా, గత శుక్రవారం డాలరుతో మారకంలో 24 పైసలు క్షీణించిన రూపాయి సాంకేతికంగా కీలకమైన 67 స్థాయిని దాటి బలహీనపడింది. పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇది రూపాయిని బలహీనపరిచిందనీ, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడటం కూడా ప్రభావం చూపిందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపుంజుకుందన్న ఫెడ్ రిజర్వ్ ఉపాధ్యక్షుడు స్టాన్లీ ఫిచెర్ వ్యాఖ్యలు రూపాయి విలువను ప్రభావితం చేసిందని ఫారెక్స్ డీలర్స్ చెప్పారు. జాక్సన్ హోల్‌లో ప్రసంగించనున్న అమెరికా ఫెడలర్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ యెలెన్ వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు ఇవ్వవచ్చునంటూ పెరిగిన అంచనాలు డాలరుకు బలాన్నిచ్చినట్లు వివరించారు.
ఫెడ్ వడ్డీ రేట్లు పెరగనున్నాయనే అంచనాలతో డాలర్ బాగా బలపడడంతో బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరిగింది. అటు దేశీ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సందేశాలు, రూపాయి బలహీనత నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు దిగారు.
నేలచూపులు చూస్తున్న రూపాయి
Published Mon, Aug 22 2016 12:32 PM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement
Advertisement