సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ డాలర్‌మారకంలో మరింత కిందికి పడిపోయింది. ముఖ్యంగా మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో రూపాయి సంవత్సరం కనిష్టానికి పడిపోయింది. గురువారం సాయంత్రం మార్కెట్ ముగిసిన తరువాత ఆర్‌బీఐ మినిట్స్ విడుదల చేశారు. మరోవైపు మార్చి నెలలో వాణిజ్య లోటు 28.5 శాతానికి చేరడం, దేశంలో నగదు కష్టాలు కూడా తోడయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఎంపీసీ సభ్యులందరూ పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు కనీస మద్దతు ధర, ముడి చమురు ధరలు పెరుగుదల లాంటి అంశాలను ప్రస్తావించారు. అలాగే దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడుతుండటానికితోడు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మండుతుండటం కూడా సెంటిమెంటును బలహీనపరచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చమురు ధరల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్బణం బలపడితే.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు త్వరపడవచ్చన్న అంచనాలు పెరిగాయి. దీంతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. నిన్న(గురువారం) డాలరుతో మారకంలో రూపాయి 14 పైసలు నీరసించి 13 నెలల కనిష్టం 65.80ను వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment