
ఐఎస్ ఉగ్రవాదులను వణికిస్తోన్న రష్యా
డెమాస్కస్: చెప్పిన మాట చెప్పినట్లుగా రష్యా చేస్తోంది. వ్యూహాలతో ముందుకు వెళుతూ సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తోంది. తొలిసారి సెప్టెంబర్ 30 నుంచి దాడులు ప్రారంభించిన రష్యా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు కంటిపై కునుకులేకుండా చేస్తుంది. తమ దేశానికి చెందిన వైమానిక దళాన్ని రంగంలోకి దించి ఎక్కడికక్కడ ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతం చేసిన రష్యా రాత్రిపూట కూడా దాడులు చేస్తోంది. రాత్రిపూట ప్రయోగించి నైట్ టైం క్రూయిజ్ మిసైల్స్ ను ప్రయోగించి సిరియాలోని పలు ఉగ్రవాద స్థావరాలను కూల్చిపడేసింది.
సిరియాలోని మూడు కీలక ఉగ్రవాద స్థావరాలపై భారీ మిసైల్స్తో రష్యా రాత్రి దాడులకు పాల్పడిందని అధికారులు తెలిపారు. క్యాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రయోగించిన క్షిపణి ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీని, ఆయుధ నిల్ల ప్రాంతాలను, ఇంధన స్టోరేజిలను, శిక్షణ ఇచ్చే క్యాంపులను ధ్వంసం చేసి పారేసిందని, దీంతో ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతగిలినట్లయింది. ఒకప్పుడు ఘనమైన చరిత్ర, సంస్కృతి సాంప్రదాయాలు విలసిల్లిన సిరియాలో నేడు ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారిస్తున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు కూడా భయాందోళనలతో తమ మాతృభూమిని వదిలి వివిధ యూరోపియన్ దేశాలకు వలస వెళుతున్నారు. దీంతో ప్రపంచంలోని శక్తిమంతమన దేశాలైన రష్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు సిరియాలోని ఉగ్రవాదులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించాయి.