
224 ప్రాణాలు గాలిలోకి...
ఈజిప్టులో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 224 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎర్రసముద్ర పర్యాటక నగరమైన షర్మెల్ షేక్ నుంచి రష్యాలోని
ఈజిప్టులో కూలిన రష్యా విమానం
ప్రయాణికుల్లో ముగ్గురు మినహా అందరూ రష్యన్లే.. మృతుల్లో 17 మంది బాలలు
♦ వందకుపైగా మృతదేహాల వెలికితీత, బ్లాక్ బాక్సుల స్వాధీనం..
♦ సాంకేతిక సమస్య వల్లే ప్రమాదం!
♦ తామే కూల్చామన్న ఐఎస్.. నిర్ధారించని అధికారులు
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 224 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎర్రసముద్ర పర్యాటక నగరమైన షర్మెల్ షేక్ నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయల్దేరిన రష్యన్ ఎయిర్‌బస్ విమానం ఏ321-23 టేకాఫ్ తర్వాత కొన్ని నిమిషాలకే సినాయ్ ద్వీపకల్పంలో కొండ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలోని మొత్తం 217 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది మృతిచెందారు. ప్రయాణికుల్లో అత్యధికం పర్యాటకులు కాగా, వారిలో 17 మంది బాలలు, 138 మంది మహిళలు ఉన్నారు. ప్రయాణికుల్లో ముగ్గురు మినహా అందరూ రష్యన్లే. సిరియాలో తమపై రష్యా దాడులకు ప్రతీకారంతో విమానాన్ని కూల్చామని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ప్రకటించింది. అయితే దీన్ని అధికారులు ధ్రువీకరించలేదు.
ప్రమాద స్థలం నుంచి శనివారం పొద్దుపోయేసరికి కాలిపోయిన వందకుపైగా మృతదేహాలను వెలికితీశారు. ఘటనాస్థలి బీభత్సంగా కనిపించిందని, చాలా మంది బె ల్టు చుట్టుకుని, కూర్చున్నవారు కూర్చున్నట్లే చనిపోయారని ఒక అధికారి చెప్పారు. విమానం ఉత్తర సినాయ్‌లోని అరిష్ నగరానికి వంద కి.మీ. దూరంలోని హసానాలో కూలి రెండు ముక్కలైందని, ఒక భాగం మంటల్లో చిక్కుకోగా, మరో భాగం బండరాయిని ఢీకొందని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యల వల్లే విమానం కూలిందని ప్రాథమిక అంచనా.
అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరిన పైలట్ పశ్చిమ సైబీరియాలోని చిన్న ఎయిర్‌లైన్స్ సంస్థ కొగలిమవియాకు చెందిన మెట్రోజెట్ బ్రాండ్ కేజీఎల్9268 విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 5.51 గంటలకు షర్మెల్ షేక్ నుంచి టేకాఫ్ తీసుకున్న 23 నిమిషాల తర్వాత ఈజిప్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. విమానం 30 వేల అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ నుంచి చివరి సందేశం అందిందని ఎయిర్ కంట్రోల్ అధికారి వెల్లడించారు. ‘ఒక వైర్‌లెస్ పరికరం పనిచేయడం లేదని, దగ్గర్లోని విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతివ్వాలని పైలట్ కోరారు’ అని పేర్కొన్నారు.
సాంకేతిక సమస్య వల్లే విమానం కూలిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కమిటీ చీఫ్, పైలట్ అమన్ మొకదమ్ అన్నారు. ‘పైలట్ విమాన వైఫల్యాన్ని పసిగట్టి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. అల్ అరిష్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా కూలిపోయినట్లు కనిపిస్తోంద’ని చెప్పారు. విమాన శకలాలను సైనిక విమానాలు గుర్తించాయని, 45 అంబులెన్సుల్లో మృతదేహాలను తరలించామని, బ్లాక్ బాక్సులను కూడా స్వాధీనం చేసుకున్నామని ఈజిపు ప్రభుత్వం తెలిపింది. మృతదేహాలను రష్యా ఎంబసీలో ఉంచి, తర్వాత ఆ దేశానికి తరలిస్తామని ఈజిప్టు ప్రాసిక్యూటర్ జనరల్ సాదిక్ తెలిపారు. ఈ విమానాన్ని తాము అద్దెకు తీసుకున్నామని మాస్కోలోని పర్యాటక సంస్థ బ్రిస్కో ప్రతినిధి తెలిపారు. ఈజిప్టు ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్, ఇతర మంత్రులు ఘటనా స్థలికి వెళ్లి, రష్యా రాయబారితో మాట్లాడి సంతాపం తెలిపారు. ఈజిప్టు అధ్యక్షుడు అల్ సిసీ కూడా సంతాపం తెలిపి, విచారణకు ఆదేశించారు.
దర్యాప్తునకు ఆదేశం..
ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈజిప్టుకు సహాయక బృందాలను పంపాలని, ప్రమాదంపై దర్యాప్తు జరపాలని తమ అధికారులను ఆదేశించారు. రష్యాలో ఆదివారాన్ని సంతాప దినంగా ప్రకటిస్తున్నామన్నారు. రష్యా అత్యవసర సేవల మంత్రి వ్లాదిమిర్ పుచ్‌కోవ్, ఇతర అధికారులు ఈజిప్టుకు చేరుకున్నారు. కొగలిమవియా సంస్థ విమాన ప్రయాణ నిబంధనలు ఉల్లంఘించి, సరైన సన్నాహాలు చేయడంలో విఫలమైనట్లు రష్యా అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఇంజిన్‌లో లోపాలు!
ప్రమాదానికి గురైన విమానం ఇంజిన్‌లో సమస్యలున్నాయని సిబ్బంది ఇటీవలే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంజిన్ స్టార్ట్ కావడం లేదని, సాంకేతిక సాయం అందించాలని సిబ్బంది గత వారం పలుసార్లు యాజమాన్యాన్ని కోరారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రష్యన్ మీడియా తెలిపింది. విమానం 19 ఏళ్ల నుంచి సర్వీసులో ఉంది.
మేమే కూల్చేశాం: ఐఎస్
రష్యన్ విమానం కేజీఎల్9268ను తామే కూల్చేశామని ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) స్థానిక అనుబంధ సంస్థ ఎస్‌ఎంఎస్ ద్వారా ప్రకటించారు. ‘ఖలీఫా సైనికులు రష్యా విమానాన్ని విజయవంతంగా కూల్చారు. సిరియాలో ఐఎస్‌పై రష్యా వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ పని చేశాం’ అని పేర్కొన్నారు. అయితే ఎలా కూల్చారో మాత్రం చెప్పలేదు. విమానం కూలిన సినాయ్ ద్వీపకల్పంలో ఐఎస్ అనుబంధ సంస్థ తిరుగుబాటు, మిలిటెంట్లపై ఈజిప్టు బలగాలు పోరు నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఐఎస్ ప్రకటనను నిజమని భావించనవసరం లేదని రష్యా రవాణా మంత్రి మాగ్జిమ్ సోలకోవ్ అన్నారు. ఐఎస్ చెబుతున్న దానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారమూ లేదని రష్యా అధికారులు పేర్కొన్నారు. సినాయ్ ప్రాంతంలో 2014లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఓ సైనిక హెలికాప్టర్‌ను కూల్చేశారు. అయితే 30 వేల అడుగుల ఎత్తులో వెళ్లే విమానాన్ని కూల్చే ఆయుధాలు, సామర్థ్యం వారికి లేవని తెలుస్తోంది. పైలట్ సాంకేతిక సమస్య ఉందని సందేశం పంపడంతో ఐఎస్ ప్రకటన నమ్మశక్యంగా లేదని భావిస్తున్నారు.
ఐఎస్ నేపథ్యం.. ఐఎస్‌గా ప్రచారంలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా.. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం రాజ్య(ఖలీఫా) స్థాపన లక్ష్యంగా పెట్టుకుంది. ఇరాక్, సిరియాలో పలు ప్రాంతాల్లో సొంత పాలన సాగిస్తోంది. లిబియా, నైజీరియాలో కొన్ని ప్రాంతాలూ దీని చేతిలో ఉన్నాయి. ఈజిప్టు సహా పలు ఆఫ్రికా దేశాల్లో దీనికి అనుబంధ సంస్థలున్నాయి. ఇది 2004లో అల్ కాయిదాలో చేరి, గత ఏడాది అందులోంచి బయటికొచ్చింది.