అమెరికాపై రష్యా ప్రతీకారం..!
ప్రచ్చన్న యుద్ధం పునఃప్రారంభమైందా? అనే స్థాయిలో అమెరికా, రష్యాలు ఒకరిపై మరొకరు అస్త్రాలను సంధించుకుంటున్నారు. అమెరికాలో పనిచేస్తోన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై ఒబామా సర్కారు బహిష్కరణవేటు వేసిన గంటల వ్యవధిలోనే రష్యా కూడా ప్రతికారానికి దిగింది. రష్యాలో పనిచేస్తోన్న 35 మంది అమెరికన్ దౌత్య అధికారులపై వేటే వేసేందుకు పుతిన్ సర్కారు పూనుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. అంతేకాదు.. తన భూభాగం(మాస్కో)లోని ఆంగ్లో అమెరికన్ స్కూలును రష్యా ప్రభుత్వం మూసేయించినట్లు కూడా వార్తలు ప్రసారం అయ్యాయి.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా దాదాపు అన్నిదేశాలతో మైత్రి కొనసాగించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. చివరి రోజుల్లో మాత్రం ప్రచ్చన్న యుద్ధాన్ని పునఃప్రారంభించినట్లు సంకేతాలు పంపుతున్నారు. మొన్న ఐక్యరాజ్యసమితో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వ్యవహరించి, నిన్న 35 మంది రష్యా దౌత్య అధికారులపై బహిష్కరణ వేటు వేశారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా దౌత్యాధికారులు హ్యాకింగ్‌కు పాల్పడ్డారని, తద్వారా డెమోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా, ట్రంప్‌కు అనుకూలంగా వ్యవస్థను నడిపించారని ఒబామా ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఒబామా ఇంకో 20 రోజుల్లో గద్దెదిగిపోనున్న నేపథ్యంలో రష్యా, ఇజ్రాయెల్‌లపై విధించిన ఆంక్షలు ఏమేరకు కొనసాగుతాయనేది అనుమానమే.
అమెరికాలో పనిచేస్తోన్న తమ 35 మంది దౌత్యాధికారులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ బ్రిటన్‌లోని రష్యా రాయబార కార్యాలయం శుక్రవారం ట్వీట్ బాంబు పేల్చింది. 'ఒబామా నిర్ణయం కోల్డ్ వార్‌ను తలపించేలా ఉంది. తన చివరి రోజుల్లో ఆయనలా ఏదోఒకటి చేయడం వల్ల అమెరికన్లు సహా చాలామంది గర్విస్తారు' అనే కామెంట్ తోపాటు ఒబామాను లేమ్‌డక్తో పోల్చుతూ ఫొటోను పోస్ట్ చేసింది. (అధ్యక్ష పదవికి ఎన్నికైన అభ్యర్థి పదవీ స్వీకారం చేసేదాకా కొనసాగే పాత అధ్యక్షుడిని ‘లేమ్ డక్’గా వ్యవహరిస్తారు)
చివరి రోజుల్లో ఒబామా సర్కారు తీసుకుంటోన్న వివాదాస్పద నిర్ణయాల్లో కొన్నింటిని వ్యతిరేకిస్తోన్న కాబోయే అధ్యక్షుడు ట్రంప్.. 'రష్యా దౌత్యాధికారులపై వేటు'పై ఆచితూచి స్పందించారు. అతి త్వరలోనే ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమై ఈ వ్యవహారంపై చర్చిస్తానన్నారు. ఐరాసలో ఇజ్రాయెల్‌పై అభిశంసన విషయంలో మాత్రం ట్రంప్ బాహాటంగానే ఒబామాను తప్పుపట్టారు.