ఇంటికి రక్షణ.. సకల సౌకర్యాలు | Safe and comfortable house arrangements from Z-Wave | Sakshi
Sakshi News home page

ఇంటికి రక్షణ.. సకల సౌకర్యాలు

Published Thu, Nov 7 2013 3:08 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

ఇంటికి రక్షణ.. సకల సౌకర్యాలు - Sakshi

ఇంటికి రక్షణ.. సకల సౌకర్యాలు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీరు ఇంటికి చేరుకునేలోపే సిద్ధంగా ఉండే వేడి వేడి వంటకాలు. గోరువెచ్చని నీళ్లు. చల్లని గదులు. ఇంటికి చేరుకోగానే వాహనాన్ని గుర్తుపట్టి తెరుచుకునే గేటు. లోనికి వెళ్లగానే వెలిగే లైట్లు. స్మార్ట్‌ఫోన్‌తో ఒక్క క్లిక్ చేస్తే చాలు. ఇలా కావాల్సిన సౌకర్యాలు సిద్ధం. ఏంటి ఇదేదో అద్భుతమనుకోకండి. మీకు కావాలంటే అచ్చం ఈ సౌకర్యాలన్నీ పొందవచ్చు. ఇందుకు సాధారణ విల్లాకు రూ.2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరిన్ని సౌకర్యాలు కావాలంటే అదనంగా వెచ్చించాల్సిందే. మరో విషయమేమంటే విలాసవంతమైన సౌకర్యాలతోపాటు ఇంటికి భద్రత కూడా ఉంటుంది. జీ-వేవ్ అనే కంపెనీ భారత్‌తోసహా 60 దేశాల్లో ఇటువంటి యాంత్రికీకరణ (ఆటోమేషన్) సేవలను అందిస్తోంది. జీ-వేవ్ ఇండియా 600 రకాల సేవలను ఆఫర్ చేస్తోంది.
 
 రూ.20 లక్షలు వెచ్చించి..
 స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, పీసీ చేతిలో ఉంటే చాలు. మైక్రోవేవ్ ఓవెన్, గీజర్, ఏసీ ఇలా ఏదైనా సరే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. లైట్ల వెలుగును నియంత్రించవచ్చు. ఇంట్లోకి ఏ సమయంలో ఎవరెవరు వస్తున్నారు, వెళ్తున్నారు తెలుసుకోవచ్చు. ఇంట్లో ఎటువంటి సందడి లేకపోయినా అప్రమత్తం చేసే వ్యవస్థ కూడా ఉందని జీ-వేవ్ టెక్నికల్ లీడ్ కె.కరణ్ బుధవారమిక్కడ తెలిపారు. పాత ఇంటికి యాంత్రికీకరణకు ఎటువంటి మార్పు లు చేయనవసరం లేదని అన్నారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన ఒకరు రూ.20 లక్షలు వెచ్చింది ఇంటికి విలాసవంతమైన భద్రత కల్పించారట. మొక్కలకు నీరుపోయడం మొదలు అక్వేరియంలో చేపలకు ఆహారం వేయడం వంటి యాంత్రికీకరణ సేవలను ఆయన పూర్తి స్థాయిలో అమర్చుకున్నారట.
 
 పర్యవేక్షణ మాదే..
 వ్యవసాయ క్షేత్రం, ఇల్లు, కార్యాలయం.. స్థలం ఏదైనా, ఎక్కడున్నా భద్రత పర్యవేక్షిస్తామని అంటోంది ప్రోవిజిల్ సర్వెలెన్స్ లిమిటెడ్.  కంపెనీ అద్దె ప్రాతిపదికన కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. పర్యవేక్షణకు నెలకు కొంత చార్జీ చేస్తోంది. అనుమానిత వ్యక్తులు వస్తే అలారం మోగడంతోపాటు యజమానుల మొబైల్‌కు సందేశం పంపి అప్రమత్తం చేస్తారు. టెలికాం టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో వీశాట్ ఆధారంగా కెమెరాలను కేంద్ర వ్యవస్థకు అనుసంధానిస్తున్నట్టు కంపెనీ సీవోవో మురళి రాచపూడి తెలిపారు. అమెరికా, యూకేలో ఇప్పటి వరకు 3 వేల కెమెరాలను ఏర్పాటు చేసి విజయవంతమయ్యామని చెప్పారు. ఇప్పుడు భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడాలో అడుగు పెట్టామని అన్నారు. హైదరాబాద్‌లో కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. భద్రత పర్యవేక్షణకు హైదరాబాద్, వైజాగ్‌లో 500 మంది సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉంటారు.
 
 రూ.4,300 కోట్లకు సెక్యూరిటీ పరిశ్రమ..
 సెక్యూరిటీ టెక్నాలజీ, ఉత్పత్తుల మార్కెట్ దేశంలో సుమారు రూ.4,300 కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు ఏటా 30 శాతం నమోదవుతోందని యూబీఎం ఇండియా సెక్యూరిటీ విభాగం ఈడీ వర్గీస్ వి జోసెఫ్ తెలిపారు. పారిశ్రామికీకరణ, నగరాలకు వలసలు, తీవ్రవాదం తదితర అంశాల కారణంగా భద్రత ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. గృహాలకు, కార్పొరేట్ కంపెనీలకు భద్రత కల్పించే థర్డ్ పార్టీ సేవలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని అన్నారు. గ్రేటర్ నోయిడాలో డిసెంబరు 5-7 తేదీల్లో జరగనున్న ఐఎఫ్‌ఎస్‌ఈసీ-2013 ప్రదర్శన వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 దేశాలకు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లు అధునాతన సెక్యూరిటీ ఉపకరణాలను ప్రదర్శిస్తారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement