
మహిళలకు మాజీ మంత్రి షాకింగ్ సలహా
రాంపూర్: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజంఖాన్ మరోసారి తనదైన శైలిలో వార్తలు నిలిచారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే మహిళలు ఇళ్లలో ఉండటమే మేలు అని ఆయన షాకింగ్ సలహా ఇచ్చారు. తన జిల్లా రాంపూర్‌లో ఇద్దరు అమ్మాయిలను 14మంది ఆకతాయిలు అత్యంత దుర్మార్గంగా లైంగికంగా వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగుచూసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలో యోగి సర్కారు వచ్చిన తర్వాత నేరాలు అమాంతం పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఒకవైపు సమాజ్‌వాదీ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా అందుకు భిన్నంగా ఆజంఖాన్ స్పందించారు. 'రాంపూర్‌లో అమ్మాయిలను వేధించిన ఘటనలో ఆశ్చర్యపోవడానికేముంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు పెరిగిపోయాయి' అని ఆయన అన్నారు. బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన తర్వాత మహిళలు ఇంట్లో ఉండేలా పురుషులు చూసుకోవడమే మంచిది. అమ్మాయిలు కూడా అసభ్య ఘటనలు చోటుచేసుకునే ప్రదేశాలకు వెళ్లకూడదు' అంటూ ఆయన సలహా ఇచ్చారు. 14 ఏళ్ల కూతురిని, తల్లిని గ్యాంగ్‌రేప్ చేసిన బులంద్‌షహర్ ఘటనపై అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ ప్రభుత్వాన్ని బద్నా చేసే రాజకీయ కుట్రతోనే ఈ ఘటన జరిగిందని ఆయన పేర్కొనడం దుమారం రేపింది.