డిమాండ్లో దూసుకెళ్తున్న గెలాక్సీ నోట్7
ఐరిస్ స్కానర్తో ప్రత్యేక ఆకర్షణగా వినియోగదారుల ముందుకు వచ్చిన కొత్త గెలాక్సీ నోట్7కు డిమాండ్ భారీగా పెరుగుతుందట. కంపెనీ అంచనాలను అధిగమించి ఈ ఫోన్ డిమాండ్ నమోదవుతుందని టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది. గ్లోబల్గా సప్లైను డిమాండ్ అధిగమించడంతో లాంచింగ్ కావాల్సిన మార్కెట్లలో ఆవిష్కరణ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్టు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త ప్రీమియం డివైజ్, తమ వ్యాపారాలను మరింత వృద్ధి బాటలో నడిపిస్తుందని, అత్యధిక రాబడులను ఆర్జించడానికి దోహదం చేస్తుందని ప్రపంచపు స్మార్ట్ఫోన్ రారాజు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పెరుగుతున్న డిమాండ్తో దానికి పోటీగా మరో టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త స్మార్ట్ఫోన్ను వచ్చే నెలల్లోనే ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతుంది.
గణనీయమైన స్మార్ట్ఫోన్ విక్రయాలతో ఈ త్రైమాసికంలో కూడా శాంసంగే ఆధిపత్యంలో నిలుస్తుందని కంపెనీ వెల్లడిస్తోంది. మరోవైపు డిమాండ్కు అనుగుణంగా సప్లై చేయలేని నేపథ్యంలో శాంసంగ్ రెవెన్యూలను కోల్పోవాల్సి వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది కూడా కర్వ్డ్ డిస్ప్లే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ను శాంసంగ్ ఆశించిన మేర సప్లై చేయలేకపోయిందని గుర్తుచేశారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా త్వరలోనే గెలాక్సీ నోట్7 ఉత్పత్తులు చేపడతామని కంపెనీ తెలిపింది. సప్లై సమస్యను వెంటనే పరిష్కరించి డిమాండ్ను చేధిస్తామని వెల్లడిస్తోంది.