శాంసంగ్ మడతపెట్టే ఫోన్ల రాక అప్పుడేనట!
శాంసంగ్ మడతపెట్టే ఫోన్ల రాక అప్పుడేనట!
Published Fri, Feb 10 2017 7:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కుతూ మడతపెట్టే ఫోన్లపై కంపెనీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇక త్వరలోనే దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయబోతుందంటూ వార్తలు వచ్చాయి. అయితే శాంసంగ్ మాత్రం ఇంకొంచెం ఆలస్యంగా 2017 చివరి త్రైమాసికంలో మడతపెట్టే తొలి స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందట. ఈ విషయాన్ని డిజిటైమ్స్ రిపోర్టు చేసింది. అలాగే తొలుత కొంతమొత్తంలోనే ఉత్పత్తి చేపట్టి వినియోగదారుల ముందుకు తీసుకురావాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నట్టు డిజిటైమ్స్ పేర్కొంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేపట్టడానికి కంపెనీకి వీలుపడటం లేదని, టెక్నికల్ సమస్యల వల్ల ఈ ఫోన్లను చిన్నమొత్తంలోనే తయారుచేయనున్నారని తెలుస్తోంది.
2018 రెండో త్రైమాసికం వరకు పెద్ద మొత్తంలో ఈ మడతపెట్టే డివైజ్లను తయారుచేయరని టాక్. చాలా అనువుగా ఉండే అమోలెడ్ డిస్ప్లేతో వీటిని రూపొందించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ దక్షిణ కొరియా దిగ్గజం మడతపెట్టే డివైజ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఇప్పటికే పలు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ ఫోన్లపై కంపెనీ కూడా అదే స్థాయిలో హాడ్వర్క్ చేస్తుందట. ముందస్తు రూమర్ల ప్రకారం కంపెనీ విడుదల చేయబోయే మడతపెట్టే డివైజ్ గెలాక్స్ ఎక్స్ అని తెలిసింది. ఈ నెల చివరిలో జరుగబోయే ఎండబ్ల్యూసీ ఈవెంట్లో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు తీసుకొస్తుందని అంచనావేశారు. కానీ ఈవెంట్ దగ్గరపడే కొద్ది గెలాక్సీ ఎక్స్ను ఇప్పుడు ప్రవేశపెడతారు, అప్పుడు ప్రవేశపెడతారు అంటూ పలు రిపోర్టులు వస్తున్నాయి. చివరికి శాంసంగ్ మడతపెట్టే డివైజ్లు ఈ ఏడాది చివరి త్రైమాసికంలోనే మన ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది.
Advertisement
Advertisement