
సండ్ర బెయిల్ పిటిషన్‌పై నేడు ఉత్తర్వులు
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’లో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు వెలువరించనుంది. బెయిల్ మంజూరు చేయాలంటూ సండ్ర దాఖలు చేసుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి లక్ష్మీపతి సోమవారం విచారణ జరిపారు. ‘‘ఓటుకు కోట్లు’ కుట్రకు సంబంధించిన అన్ని విషయాలు సండ్రకు తెలుసు. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా 10 రోజులు ఉద్దేశపూర్వకంగానే పక్క రాష్ట్రంలో ఉన్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చిన తర్వాత.. నాలుగో నిందితుడు మత్తయ్య అరెస్టుపై హైకోర్టు స్టే విధించిన తర్వాత తాను విచారణకు సిద్ధంగా ఉన్నానంటూ ఏసీబీకి లేఖ రాశారు.
సెబాస్టియన్‌ను కస్టడీలో విచారించినప్పుడు ఈ కుట్రతో సండ్రకు సంబంధముందనే విషయాన్ని అతను చెప్పలేదు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే సండ్ర పాత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆయన టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. బెయిలిస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను మాయం చేసే అవకాశముంది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి..’’ అని ఏసీబీ తరఫున స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు న్యాయమూర్తిని అభ్యర్థించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను సండ్ర ఇప్పటికే ఏసీబీకి తెలియజేశాడని, ఇంకా చెప్పాల్సిందేమీ లేదని సండ్ర తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా దర్యాప్తునకు సహకరిస్తారని, ఎప్పుడు పిలిచినా అధికారుల ముందు హాజరవుతారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేశారు.
రేవంత్ గైర్హాజరుపై అసహనం
ఈ కేసు విచారణలో భాగంగా మొదటి నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సహా ఇతర నిందితులు సోమవారం ఏసీబీ కోర్టు ముం దు హాజరుకావాల్సి ఉండగా.. రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు. బెయిల్ షరతుల్లో భాగం గా నియోజకవర్గం వదలి వెళ్లరాదని హైకో ర్టు ఆదేశించిన నేపథ్యంలోనే రేవంత్ కోర్టు కు హాజరుకాలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. నియోజకవర్గం వదలి వెళ్లరాదంటే కోర్టు విచారణకు హాజ రుకాకూడదని కాదని న్యాయమూర్తి వారికి స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఆగస్టు 3కు వాయిదా వేస్తున్నానని, ఆ రోజున రేవంత్ హాజరుకావాలని ఆదేశించారు. ఇక మిగతా నిందితులను మాత్రం ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించి సమన్లు జారీచేసిన తర్వాత కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.