mla sandra venkata veeraiah
-
ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే
ఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా మిర్చి ధర రోజురోజుకు తగ్గడంతో చేపట్టిన ఆందోళనను రైతులు అంత సులువుగా విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. శనివారం నాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగి చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా మార్కెట్లోని సుమారు 1000 కాంటాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ప్రాణభయంతో ఉద్యోగులు, కార్యదర్శి పరుగులు తీసిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా మార్కెట్‌కు వచ్చిన ఎమ్మెల్యే సండ్ర ఆందోళన జరుగుతున్న సమయంలో చైర్మన్ చాంబర్లోకి వెళ్లి మిర్చి ధరపై చర్చించారు. అయితే సండ్ర రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టంతో వారు తీవ్ర ఆవేశానికిలోనై కంప్యూటర్లు, ఫర్నీచర్, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఏ-2గా ఆయన పేరును చేర్చారు. -
టీడీపీకీ నో ఎంట్రీయేనా?
బీఏసీ నుంచి సండ్రను పంపించిన అసెంబ్లీ సిబ్బంది సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లపై ఆదివారం జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో టీటీడీపీ ఎమ్మెల్యేలకు ప్రవేశం లేనట్టేనని తెలుస్తోంది. సభ నిర్వహణపై శనివారం జరిగిన బీఏసీ భేటీలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను పాల్గొనకుండా అసెంబ్లీ సిబ్బంది నిలువరించారు. బీఏసీ భేటీకి హాజరుకావాలంటూ ఆహ్వానించిన అసెంబ్లీ సచివాలయమే, సమావేశం నుంచి బయటకు పంపించింది. గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీటీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అదే సస్పెన్షన్ టీడీపీ సభ్యులకు ఇప్పుడు కూడా వర్తిస్తుందని అసెంబ్లీ సిబ్బంది తేల్చిచెప్పారు. పిలిచి అవమానిస్తారా?: రేవంత్‌రెడ్డి అసెంబ్లీ నిబంధనలను పక్కనబెట్టి టీఆర్ఎస్ కార్యాలయంగా నడిపించుకుంటున్నారని టీటీడీఎల్పీ నేత ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు, శాసనసభ కార్యదర్శి సదారాం కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోందని ఆరోపించారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన స్పీకర్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. బీఏసీ సమావేశానికి పిలిచి అవమానించడం దారుణమన్నారు. అసెంబ్లీ కార్యదర్శి సదారాంను సస్పెండ్ చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇంత అవమానమా: సండ్ర బీఏసీ సమావేశానికి పిలిచి, ఆ తరువాత బయటకు వెళ్లాలని చెప్పడం అత్యంత అవమానకరమని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రభుత్వం టీడీపీ గొంతు నొక్కుతున్నదన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని సండ్ర హెచ్చరించారు. -
ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది. మరోవైపు పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతించింది. -
ఏపీ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నోటీసులు జారీ చేసింది. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సండ్ర తాజా పరిణామాలపై పలువురితో చర్చించారు. ఓటుకు కోట్లు కేసులో సండ్ర వీరయ్య అయిదో నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. -
డెంగీతో చనిపోతున్నా చలనం లేదా?
ఖమ్మం: డెంగీ జ్వరాలతో ప్రజలు చనిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం చలనం లేకుండా వ్యవహరిస్తోందని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 21మంది డెంగీతో మృతిచెందినా మంత్రులకు వారి కుటుంబాలను పరామర్శించే తీరిక లేకుండా పోయిందన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, చికిత్సకు అయిన ఖర్చును సీఎం సహాయ నిధి నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చనిపోయిన వారి కుటుంబీకులకు రూ. 25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. డెంగీ జ్వరాలు అదుపులోకి వచ్చేదాకా సంబంధిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. -
తెలంగాణ ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకం కాదు
ఏపీతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న కేసీఆర్: టీడీపీ నేతలు తిరుపతి తుడా: తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు టీడీపీ వ్యతిరేకం కాదని ఆపార్టీ తెలంగాణా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. తిరుపతి మహానాడులో మూడవ రోజు ఆదివారం మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు వ్యతిరేకంగా మహానాడులో టీడీపీ తీర్మానం చేసిందని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. నదులపై కర్ణాటక, మహారాష్ట్రలో అక్రమంగా 400 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారన్నారు. ఆ రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లే కేసీఆర్ నోరుమెదపడంలేదన్నారు. ప్రాజెక్ట్‌ల పేరుతో ధనదోపిడీకి పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులం కలసి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఓ పక్క చెబుతూనే మరోపక్క ఏపీతో కేసీఆర్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ టీడీపీని ఇబ్బంది పెట్టేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ బోర్డు మెంబర్ నిజామాబాద్ టీడీపీ అధ్యక్షుడు అరికెల నరసారెడ్డి మాట్లాడుతూ గోదావరి కృష్ణాజలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని మహానాడులో తీర్మానం చేశామన్నారు. ఆంధ్రాలో తెలంగాణలో టీడీపీ నేతలు ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కట్టే ప్రాజెక్టులు సక్రమంగా ఉంటే తామే టీడీపీ అధినేతతో మాట్లాడి అడ్డుతగలకుండా చూస్తామని చెప్పారు. -
సండ్ర బెయిల్ పిటిషన్‌పై నేడు ఉత్తర్వులు
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’లో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు వెలువరించనుంది. బెయిల్ మంజూరు చేయాలంటూ సండ్ర దాఖలు చేసుకున్న పిటిషన్‌పై న్యాయమూర్తి లక్ష్మీపతి సోమవారం విచారణ జరిపారు. ‘‘ఓటుకు కోట్లు’ కుట్రకు సంబంధించిన అన్ని విషయాలు సండ్రకు తెలుసు. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా 10 రోజులు ఉద్దేశపూర్వకంగానే పక్క రాష్ట్రంలో ఉన్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులకు బెయిల్ వచ్చిన తర్వాత.. నాలుగో నిందితుడు మత్తయ్య అరెస్టుపై హైకోర్టు స్టే విధించిన తర్వాత తాను విచారణకు సిద్ధంగా ఉన్నానంటూ ఏసీబీకి లేఖ రాశారు. సెబాస్టియన్‌ను కస్టడీలో విచారించినప్పుడు ఈ కుట్రతో సండ్రకు సంబంధముందనే విషయాన్ని అతను చెప్పలేదు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే సండ్ర పాత్రకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆయన టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. బెయిలిస్తే దర్యాప్తును ప్రభావితం చేయడంతోపాటు ఆధారాలను మాయం చేసే అవకాశముంది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి..’’ అని ఏసీబీ తరఫున స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు న్యాయమూర్తిని అభ్యర్థించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను సండ్ర ఇప్పటికే ఏసీబీకి తెలియజేశాడని, ఇంకా చెప్పాల్సిందేమీ లేదని సండ్ర తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా దర్యాప్తునకు సహకరిస్తారని, ఎప్పుడు పిలిచినా అధికారుల ముందు హాజరవుతారని తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. రేవంత్ గైర్హాజరుపై అసహనం ఈ కేసు విచారణలో భాగంగా మొదటి నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సహా ఇతర నిందితులు సోమవారం ఏసీబీ కోర్టు ముం దు హాజరుకావాల్సి ఉండగా.. రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు. బెయిల్ షరతుల్లో భాగం గా నియోజకవర్గం వదలి వెళ్లరాదని హైకో ర్టు ఆదేశించిన నేపథ్యంలోనే రేవంత్ కోర్టు కు హాజరుకాలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. నియోజకవర్గం వదలి వెళ్లరాదంటే కోర్టు విచారణకు హాజ రుకాకూడదని కాదని న్యాయమూర్తి వారికి స్పష్టం చేశారు. ఈ కేసు విచారణను ఆగస్టు 3కు వాయిదా వేస్తున్నానని, ఆ రోజున రేవంత్ హాజరుకావాలని ఆదేశించారు. ఇక మిగతా నిందితులను మాత్రం ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించి సమన్లు జారీచేసిన తర్వాత కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. -
సండ్ర కస్టడీ పిటిషన్‌పై తీర్పు సా. 4 గంటలకు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్‌పై తీర్పును కోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఇదే కేసులో సండ్ర బెయిల్ పిటిషన్‌పై తీర్పును రేపటికి వాయిదా వేసింది. బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించింది. ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
సండ్ర కస్టడీ పిటిషన్‌పై వాదనలు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభమయ్యాయి. బుధవారం హైదరాబాద్ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌ను విచారిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆయనను కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. సండ్ర తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. సండ్రకు బెయిల్ ఇస్తే దర్యాప్తు పురోగతిని అడ్డుకుంటారని, 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేసింది. -
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
-
టుడే హెడ్‌లైన్స్....
* వైఎస్ఆర్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన * కర్నూలు వెళ్లనున్న వైఎస్ జగన్, ఆస్పత్రిలో ఉన్న భూమా నాగిరెడ్డికి పరామర్శ *కర్నూలు, ప్రకాశం జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం, మధ్యాహ్నం ఫలితాలు వెల్లడి * జపాన్‌లో చంద్రబాబు మూడోరోజు పర్యటన, మిజుహో బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం * నేటి నుంచి 14 రోజుల పాటు బుట్టే వీరభద్ర సిద్ధాంతి గణాంకాల ప్రకారం పుష్కరాలు ప్రారంభం * ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్న ఏపీ కాంగ్రెస్ నేతలు * వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన ఏసీబీ * ఎమ్మెల్యే సండ్రను కోర్టుకు హాజరు పరచనున్న ఏసీబీ అధికారులు * మహబూబ్ నగర్ జిల్లాలో నేడు పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన * తెలంగాణలో రెండోరోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె * తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, నాలుగు కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులు * నేడు కజికిస్థాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన -
ఏసీబీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే సండ్ర
-
విచారణకు రండి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘ఓటుకు నోటు కేసు’లో సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ రెండోసారి నోటీసులు జారీ చేసింది. అనారోగ్య కారణం చూపుతూ ఏసీబీ మొదటి నోటీస్‌కు సండ్ర విచారణకు హాజరుకాని విషయం విదితమే. అయితే ప్రస్తుత నోటీస్‌తో ఏసీబీ సండ్రను ఏం ప్రశ్నిస్తుంది?, ఆయన ఏం సమాధానం చెబుతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. రెండోసారి నోటీసులు జారీ హైదరాబాద్‌లోని సండ్ర నివాసానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ శనివారం నోటీసులు అంటించింది. మొదటి నోటీసు జారీతోనే ఏసీబీ విచారణ తప్పదని భావించిన సండ్ర వారి ముందు ఏం చెప్పాలో సమాయత్తం అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయ న రాజమండ్రిలో చికిత్స తీసుకుంటూ ఈ విషయమై పార్టీ అధినేతలు, న్యాయనిపుణులతో చర్చించినట్లు తెలిసింది. తన ఆరోగ్యం కుదుటపడిందని, ఏసీబీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవుతానని సండ్ర తిరిగి లేఖ రాయడంతో ఆయనకు మరోదఫా నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ప్రధా న నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికి బెయిల్ రావడం, ప్రస్తుతం సండ్రను ఏసీబీ విచారణకు పిలవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. సండ్ర విషయంలో ఏసీబీ ఎలా అడుగులు వేస్తుందోనని జిల్లాలోని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. టీడీపీలో తీవ్ర ఉత్కంఠ రేవంత్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఓవైపు ఏసీబీ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం, అది తిరస్కరణకు గురికావడంతో సండ్ర విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. విచారణతోనే వదిలి పెడతారా..లేక అరెస్ట్ చేస్తారా..? అన్న విషయంపై టీడీపీ శ్రేణుల్లో కూడా టెన్షన్ మొదలైంది. గత రెండు రోజులుగా జిల్లాలోనే ఉన్న ఆయన సత్తుపల్లి, ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించారు. ఏసీబీ రెండోసారి నోటీసులతో ఖమ్మంలోని క్యాంపు కార్యాలయం వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుని సండ్రతో చర్చించారు. ఏసీబీ విచారణతో సండ్ర భవితవ్యం ఏమవుతుందోనని పార్టీ శ్రేణులు చర్చించుకున్నాయి. ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతా ఏసీబీ రెండోసారి నోటీసుల విషయమై ‘సాక్షి’ తో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. ‘ఏసీబీ ఇచ్చిన గడువులోగా విచారణకు హాజరవుతాను. ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతాను. అనారోగ్య కారణంతోనే తొలివిడత విచారణకు హాజరుకాలేకపోయూను’ అన్నారు. -
అనారోగ్యంతో రాలేకపోతున్నా:సండ్ర
సాక్షి, హైదరాబాద్: ‘ఓటు కు కోట్లు’ కేసులో సాక్షిగా హాజరుకావాలని ఏసీబీ నుంచి నోటీసు అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విచారణకు హాజరుకాలేదు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినందున రావడం లేదని శుక్రవారం ఏసీబీ ఏ ఎస్పీ మల్లారెడ్డికి లేఖ పంపారు. 10 రోజులు ఆసుపత్రిలోనే ఉంటానని, ఆసుపత్రికి వచ్చి విచారిస్తే అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. అయితే ఏ ఆసుపత్రిలో ఉన్నారనే విషయాన్ని మాత్రం లేఖలో పేర్కొనలేదు. సండ్ర లేఖ యథాతథంగా: ‘శ్రీయుత గౌరవనీయులైన ఏసీబీ, ఏఎస్పీ ఎం.మల్లారెడ్డి గారికి, ఆర్యా, పీఎస్, ఏసీబీ, సీఆర్-1, సీఆర్ నెం.11/ఏసీబీ-సీఆర్-1/హైదరాబాద్ /2015, తేదీ 16-06-2015న కేసు విచారణ లో భాగంగా నాకు తెలిసిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ కార్యాలయానికి 19-06 -2015న హాజరుకావలసిందిగా నాకు నోటీసు ఇచ్చినట్లు మీడి యా ద్వారా, మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఈ విచారణ నిమిత్తం పూర్తిస్థాయిలో సహకరిస్తా ను. అయితే వ్యక్తిగత కారణాలతో పర్యటనలో ఉన్న సమయంలో తీవ్రమైన వెన్ను, కుడికాలు నొప్పి ఉన్నందున అందుబాటులో ఉన్న డాక్టర్లను సంప్రదించడం జరిగింది. వారు 10 రోజులు పూర్తిగా పడకకే పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా, ప్రయాణాలను వాయిదా వేసుకోవలసిందిగా సూచిం చడం జరిగింది. వారి సలహా మేరకు ప్రస్తుతం నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నాను. ఈ పరిస్థితుల్లో మీ వద్దకు రాలేకపోతున్నందు కు చింతిస్తూ, కోలుకున్న వెంటనే వచ్చి విచారణకు సహకరించగలను. లేదా మీరు నేనున్న ఆసుపత్రికి వచ్చిన యెడల మీకు కావలసిన స మాచారాన్ని ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. మీ ఫోన్ నంబర్ లేనందున ఈ లేఖను మిత్రుడి ద్వారా పంపుతున్నాను.’ - సండ్ర వెంకట వీరయ్య -
అరెస్టా..? విచారణా??
♦ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ నోటీసులపై విస్తృత చర్చ ♦ ఏమవుతుందోనని ‘దేశం’ శ్రేణుల్లో టెన్షన్ ♦ గతంలోనూ మద్యం కేసుల విషయంలో విచారణ ♦ మళ్లీ ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ ముందుకు.. సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ విచారిస్తుందా..? లేక విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తుందా..? అనే అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయడం, ఎమ్మెల్సీ బరిలో నిలిచిన వేం నరేందర్రెడ్డిపై విచారణ కొనసాగుతుండటం.. ఇందులో సండ్రకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఏసీబీ భావిస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రాజధానిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాసం ఉండే క్వార్టర్స్‌కు విచారణకు హాజరు కావాలని ఏసీబీ బృందం బుధవారం నోటీసులు అంటించింది. ఈనెల 19లోగా విచారణకు రావాలని ఈ నోటీస్‌లో ఏసీబీ పేర్కొంది. అయితే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటంతో సండ్ర పాత్రపై కూడా ఏసీబీ పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆయన జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలతో కూడా ఓటుకు నోటు విషయమై సంప్రదింపులు జరిపినట్లు ఏసీబీకి సమాచారం ఉంది. దీనిలో భాగంగానే సండ్రను విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు పంపింది. కాగా ఆయన విచారణలో వెల్లడించే విషయాలను అనుసరించి ఏసీబీ అరెస్ట్ చేస్తుందా..? కేవలం విచారణతోనే సరిపెడుతుందా? అనేదానిపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఒకొక్కరికి ఏసీబీ ఒకవైపు నోటీసులు జారీ చేస్తూ.. మరోవైపు అరెస్ట్‌లతో కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీడీపీ శ్రేణుల్లో భయూందోళన జిల్లాలోని టీడీపీ శ్రేణులు కూడా ఏ క్షణంలో ఏమవుతుందోనని భయాందోళనలో ఉన్నారుు. జిల్లాలో సార్వత్రిక పోరులో టీడీపీ చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా ఒక్క ఎమ్మెల్యేతోనే సరిపెట్టుకుంది. అతనిపై కూడా ఏసీబీ ఉచ్చు బిగించడంతో జిల్లాలో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. తుమ్మల టీడీపీని వీడటంతో ఆయన అనుచర ప్రజాప్రతినిధులు, శ్రేణులు చాలా వరకు గులాబీబాట పట్టాయి. తన ఓటమికి జిల్లాలో తన ప్రత్యర్థి పార్టీనే కంకణం కట్టుకోవడంపై ఆగ్రహంతో ఉన్న తుమ్మల టీడీపీని ఖాళీ చేయడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు. నాయకులు పోయినా.. కేడర్ మాత్రం తమ వెంటే ఉందని పలుమార్లు ప్రకటించిన టీడీపీ నేతలు తాజా పరిణామంతో కంగుతిన్నారు. సండ్రకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఏసీబీ ముందుకు రెండోసారి.. ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ నుంచి రెండోసారి నోటీసులు అందుకున్నారు. 2012 సెప్టెంబర్‌లో మద్యం సిండికేట్ ముడుపుల వ్యవహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన వరంగల్‌లో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు ఇందులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అప్పట్లో పలు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులను ఏసీబీ విచారించింది. ప్రస్తుతం మళ్లీ ఎమ్మెల్యే హోదాలోనే ఆయన ఓటుకు నోటు కేసు విషయంలో ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి వస్తోంది. జిల్లా చరిత్రలోనే ఓ ఎమ్మెల్యే ఏసీబీ ముందుకు పలు కేసుల నిమిత్తం విచారణకు హాజరు కావడం ఇదే తొలిసారి అని సమాచారం. ఏసీబీ సండ్ర విషయంలో ఎలా ముందుకెళ్తుందో..? ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని రాజకీయ పక్షాల్లో చర్చ సాగుతోంది. ఈ రెండు రోజుల్లోనే ఏసీబీ ముందుకు సండ్ర ఎప్పుడు హాజరవుతారు.. ఆయన పాత్రపై ఏసీబీ ఏం తేలుస్తుంది.. ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉందని భావిస్తే వెంటనే ఏమైనా చర్యలకు దిగుతుందా? అనేది జిల్లాలో వాడీవేడిగా చర్చ సాగుతోంది. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, శ్రేణులు సండ్రకు ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయంపై టెన్షన్‌కు గురవుతున్నారుు. ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీ విచారణకు ఎమ్మెల్యే సండ్రను పిలవడంతో ఇందులో ప్రమేయం ఉన్న ఎమ్మెల్యేల మెడలకు కూడా ఉచ్చు బిగుస్తోంది. టీడీపీ ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేల విచారణ అనంతరం ఓటు నోటుకు లొంగిన ఎమ్మెల్యేలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలకు ఏసీబీ తాకీదులు అందిస్తుందో వేచిచూడాల్సిందే. కొంతమంది జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏసీబీ దూకుడుతో బెంబేలెత్తిపోతున్నారు. తమపై ఏసీబీ ఎలా చర్యలకు ఉపక్రమిస్తుందోనని హైరానా పడుతున్నారు. టీడీపీ ఉచ్చులో చిక్కుకుని అనవసరంగా తమ రాజకీయ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నామని ఓ ఎమ్మెల్యే మథనపడుతున్నట్లు తెలిసింది. ఓటుకు నోటులో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్సీ బరిలో నిలిచిన అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా కదిలిన సదరు ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఏసీబీ చర్యలను సాకుగా చూపించి వారి రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తేనే వచ్చే ఏ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగరని పార్టీలోని పెద్ద తలకాయలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.