
విశాఖపట్నంలో వీరయ్య?
ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ నోటీసులు జారీచేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది.
ఓటుకు కోట్ల కేసులో ఏసీబీ నోటీసులు జారీచేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. అక్కడ కూడా ఆయన తన సొంత పేరుతో కాకుండా.. వేరే రోగి పేరుతో చేరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆస్పత్రి యజమాని ఆయనకు సన్నిహిత మిత్రుడు కావడంతో, అక్కడే చేరారని అంటున్నారు. అయితే.. కార్పొరేట్ ఆస్పత్రుల వర్గాలు మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించడం లేదు. ఎవరికి వారు తమ ఆస్పత్రిలో చేరలేదనే చెబుతున్నారు. (వెంకట వీరయ్య లేఖ ప్రతి)
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా సండ్ర వెంకట వీరయ్య ఇక్కడకు వచ్చారన్న విషయాన్ని ఎక్కడా పొక్కనివ్వడం లేదు. మొత్తం విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. అయితే, తెలంగాణ పోలీసులు కూడా ఇందుకు దీటుగానే వ్యూహాలు రూపొందిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు తీసుకుని.. వాటి సాయంతో వాళ్లు సండ్ర వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు కావల్సిన ఏర్పాట్లలో తెలంగాణ ఏసీబీ ఉన్నట్లు సమాచారం.