సర్ఫరాజ్ అహ్మద్‌కు మరో ప్రమోషన్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దేశానికి అందించిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రమోషన్ దక్కింది. పాక్ జట్టు టెస్టు సారథ్య బాధ్యతలు కూడా అతనికి అప్పగిస్తున్నట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇటీవల సీనియర్ క్రికెటర్ మిస్బావుల్ హక్ రిటైరవ్వడం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అనూహ్యరీతిలో పాక్ గెలుపొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
చాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో బలమైన భారత జట్టును 124 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయాల క్రెడిట్ సర్ఫరాజ్ సారథ్యానికే దక్కింది. అతని నాయకత్వంలో పాక్ జట్టు సమష్టిగా ఆడుతూ వరుసగా విజయాల బాట పట్టింది. సర్ఫరాజ్ ఇంతవరకు టెస్టులకు నాయకత్వం వహించలేదు. అయినా, అతని నాయకత్వంలో వన్డేలు, టీ-20లలో పాక్ వరుసగా విజయాలు సాధించడంతో అతనికే టెస్టు పగ్గాలు దక్కాయి. సర్ఫరాజ్ సారథ్యంలో పాక్ జట్టు ఏడు వన్డేల్లో విజయం సాధించింది. టీ-20లలో అతని కెప్టెన్సీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింటిలో గెలుపొందింది.