
క్షణక్షణం.. గవర్నర్‌తో శశికళ భేటీ!
చెన్నై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ గురువారం రాత్రి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. 120కిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, మెజారిటీ (117) మద్దతు తనకు ఉన్న కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని, అవసరమైతే.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు కూడా సిద్ధమని ఆమె తెలిపినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖలను ఆమె ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించారు. ఆమె వెంట పదిమంది మంత్రులు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట రాకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఆమె వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలంతా శశికళ ఏర్పాటుచేసిన క్యాంపులోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శశికళ అభ్యర్థనపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
పోయెస్ గార్డెన్ నుంచి నేరుగా మేరినా బీచ్ చేరుకున్న ఆమె.. అక్కడ దివంగత జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తన చేతిలోని ఎమ్మెల్యేల సంతకాలున్న పత్రాలను సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగంతో కనిపించారు. జయలలిత తరహాలో ఆకుపచ్చని చీర కట్టుకున్న శశికళ ఒకింత కన్నీటి పర్యంతమవుతూ అమ్మ సమాధి వద్దనుంచి రాజ్‌భవన్‌కు కదిలారు.