'శశికళకు జీవితఖైదు పడొచ్చు'
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరుపై సరైన రీతిలో విచారణ జరిపితే.. ఇప్పుడు నాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తున్న శశికళకు జీవిత ఖైదు పడొచ్చని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఒక రోజు నిరాహార దీక్షల అనంతరం ఆయన మాట్లాడారు. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరాహార దీక్షలు తమకోసం చేసినవి కావని, అవి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన బినామీ పాలనకు వ్యతిరేకంగా చేసినవని అన్నారు.
తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యులందరినీ బలవంతంగా బయటకు పంపించి, ఆ తర్వాత బలపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. తన చొక్కా కూడా చింపేసి పంపారని స్టాలిన్ ఆరోపించారు. దీనిపై ఆయన రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుకు కూడా ఫిర్యాదు చేశారు.