మైనారిటీలో పళని.. రంగంలోకి స్టాలిన్!
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార అన్నాడీఎంకే సర్కారు మళ్లీ సంక్షోభంలో పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అన్నాడీఎంకేలోని వైరివర్గాలైన ఈపీఎస్-ఓపీఎస్ వర్గాలు విలీనం కావడంతో అధికార పార్టీ బలోపేతమై.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే, ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే 19మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి పళని సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేని పళనిని సీఎం పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరారు. ఇదే అదనుగా ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగారు. పళనిస్వామి సర్కారు వెంటనే అసెంబ్లీ వేదికగా బలపరీక్ష సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేలు పళని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారని, మొత్తం 22మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో పళని సర్కారు కూలడం ఖాయమని ఆయన ఆశిస్తున్నారు.
ఇక, గవర్నర్‌ను కలిసిన అనంతరం శశికళ వర్గం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సీఎం పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని గవర్నర్‌కు తెలిపామని, వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా కోరామని అన్నాడీఎంకే ఎమ్మెల్యే థంగ తమిళ్ సెల్వన్ తెలిపారు.