► 4 నుంచి 9 వరకు జిల్లాల వారీగా సమావేశాలు
► నాలుగు జిల్లాలతో అంకురార్పణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆరురోజులపాటు బిజీబిజీగా గడపనున్నారు. జిల్లా వారీగా సమావేశాలతో తలమునకలు కానున్నారు. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే సాగిస్తున్న సన్నాహాలు తనపై వ్యతిరేకతను పారదోలేందుకా లేక సీఎం కుర్చీలో కూర్చునేందుకా అనే మీమాంసలో పార్టీ పడిపోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానంలో శశికళ కూర్చోవడం పూర్తయింది. ఇక సీఎం కుర్చీనే తరువాయని పార్టీలోని అగ్రనేతలు ఆమె వెంటపడుతున్నారు. అయితే ద్వితీయ నుంచి కింది స్థాయి వరకు శశికళను వ్యతిరేకిస్తున్నారు. జయ స్థానంలో శశికళను సహించేది లేదని ఏనాడో తేల్చిచెప్పేశారు. అంతేగాక రాష్ట్రంలో వెలిసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లోని శశికళ చిత్రాన్ని చింపివేసి తమ నిరసను వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ పదవిలోనే ఇంతటి ప్రతిఘటనను ఎదురవుతుండగా ఇక సీఎం పగ్గాలు చేపడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని శశికళకు బెంగపట్టుకున్నట్లు సమాచారం. ఇలాంటి ఎదురుగాలులు ఎక్కువ కాలం కొనసాగితే ముప్పు తప్పదని శశికళ జంకుతున్నారు. సీఎం సీటులో ప్రశాంతంగా కూర్చోవాలంటే పార్టీలో తన ప్రతికూరులను అనుకూలురుగా మార్చుకోవడం ముఖ్యమని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ వరకు జిల్లాల వారిగా నేతలతో సమావేశమవుతున్నారు. అంతేగాక జయలలిత మరణ మిస్టరీలో శశికళను అనుమానించడం ఎక్కువైంది. కోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సాగుతోంది. మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నెంబర్ 2 ముద్దాయిగా ఉన్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో సీఎం పదవి చేపట్టడం మంచిది కాదని వెనక్కుతగ్గినట్లు సమాచారం. సీఎం బాధ్యతలపై శశికళను ఒత్తిడి చేయరాదని పార్టీ బుధవారం హుకుం జారీ చేసింది.
పార్టీపై పట్టు కోసం: సీఎం పదవిని చేపట్టేలోగా పార్టీపై పూర్తి స్థాయిలో పట్టుకు శశికళ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత శశికళ తొలిసారిగా బుధవారం ఉదయం 11 గంటలకు రాయపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. సమాలోచనలు నిర్వహణకు బుధవారం శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు ఆమెకు స్వాగతం పలికారు. కార్యాలయ మొదటి అంతస్థులోని బాల్కని వద్ద నిల్చుని కార్యకర్తలకు రెండాకుల చిహ్నాన్ని చూపుతూ అభివాదం చేశారు. ఆ తరువాత చ్నెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సాయంత్రం వరకు శశికళ సమాలోచనలు చేశారు.
జయలలిత హయాం నాటి మిలిటరీ క్రమశిక్షణ అలాగే కొనసాగాలని, ఎటువంటి కారణాలచేతనూ అవినీతికి పాల్పడరాదని ఆమె సూచించారు. అమ్మ వెలిగించిన దీపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల సమయంలో విద్యార్థులతో వివిధ పోటీలను నిర్వహించాలని ఆదేశించారు. పార్టీలోకి యువతను ఎక్కువగా చేర్చుకోవాలని సూచించారు. ఈనెల 6వ తేదీన తేదీన తేని, దిండుగల్లు, విరుదునగర్, శివగంగై, రామనాధపురం, సేలం, నామక్కల్, ఈరోడ్, 7వ తేదీన నాగపట్నం, తిరువారూరు, పుదుక్కోట్టై, మదురై, కడలూరు, విళుపురం, కృష్ణగిరి, ధర్మపురం, 8వ తేదీన తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి, 9వ తేదీన తిరుప్పూరు, కోయంబత్తూరు, నీలగిరి, తిరుచ్చి, అరియలూరు, కరూరు, తంజావూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.
మళ్లీ పెరిగిన బందోబస్తు: జయలలిత మరణం తరువాత కూడా పోయెస్‌గార్డెన్ లో అదే స్థాయిలో బందోబస్తు అవసరమా అంటూ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా పలువురు విమర్శలు చేయడంతో పోలీసులు సంఖ్యను ఇటీవల తగ్గించారు. అయితే శశికళ ప్రస్తుతం అధికార పార్టీకి ప్రధాన కార్యదర్శిగా మారడంతో మళ్లీ బందోబస్తును పెంచారు.