‘దినకరన్‌కు, అన్నాడీఎంకేకు సంబంధం లేదు’
చెన్నై: అన్నాడీఎంకేలో రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరోసారి శశికళపై విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే తరపున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. దినకరన్‌ను ఎన్నికల కమిషన్ అనర్హుడిగా ప్రకటించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. దినకరన్‌కు, అన్నాడీఎంకే ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం ఇవాళ ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తును తనకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బరిలో దిగనున్నారు. ఏప్రిల్ 12 ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కూడా ఆర్కేనగర్ నుంచే రాజకీయ అరంగ్రేటం చేయనుంది.
కాగా జయ మరణానంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎన్నిక చెల్లదంటూ పన్నీరు సెల్వం వర్గీయులు ఈసీని ఆశ్రయించారు. ఈసీ నోటీసులు జారీచేయడంతో శశికళ వివరణ ఇచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.