
పిల్లల చదువుల కోసం ఎస్‌బీఐలో రెండేళ్ల లీవు
ముంబై: ఎస్‌బీఐ మహిళా సిబ్బందికి ఇకపై రెండేళ్ల విద్యాసంబంధ సెలవు సౌలభ్యం కలగనుంది. పిల్లల విద్య, తల్లిదండ్రులు, అత్తమామల యోగక్షేమాలను చూసుకోవడం వంటి ప్రయోజనాలకు ఈ సెలవు కాలాన్ని వినియోగించుకునే వీలుంటుంది. ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. తల్లి సంరక్షణలో లేని పిల్లల విద్యా కార్యకలాపాలకు సంబంధించి పురుష ఉద్యోగులకు సైతం ఈ ప్రయోజనం విస్తరించే అవకాశం ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఎస్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగం- ఎస్‌బీఐ క్యాప్స్ చీఫ్‌గా ఆ సంస్థలో మహిళలకు ఆరేళ్ల కాలానికి భట్టాచార్య ఈ తరహా సెలవు విధానాన్ని అమలుచేశారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులో కేవలం రెండేళ్లే ఈ సెలవును మంజూరు చేయాల్సి ఉంటుందని అన్నారు.