బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు కోత
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్లో కోతలు మొదలుపెట్టింది. బల్క్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును గణనీయంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బల్క్ డిపాజిట్ల వడ్డీరేటును 125 నుంచి 190 బేసిస్ పాయింట్లను (ఒక బేసిస్ పాయింట్లు 0.01శాతం) తగ్గించింది. ఈ మేరకు బ్యాంకు బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. కోటి నుంచి 10 కోట్ల రూపాయల డిపాజిట్లపై తగించిన ఈ వడ్డీరేట్లు రేపటినుంచే( గురువారం) అమల్లోకి వస్తాయని తెలిపింది.
ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 180-210 రోజు కాలపరిమితికి స్థిర డిపాజిట్లపై 1.90 శాతం కోత పెట్టి 3.85 శాతంగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఇది 5.75 శాతంగా ఉంది. ఒక సంవత్సరం నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6 శాతం తగ్గించింది. ఇది గతంలో 4.25 శాతంగా వుంది. ఏడు నుంచి 45 రోజుల కాలపరిమితి ఎఫ్డీఐలపై 1.25శాతం కోత పెట్టింది. ఇది గతంలో 3.75శాతం. ఈ నెల ఆరంభంలో ఒక కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించిన సంగతి తెలిసిందే.
కాగా డీమానిటైజేషన్ కారణంగా దేశంలోని బ్యాంకుల్లో సుమారు రూ 5.4 లక్షల కోట్లు జమ అయినట్టు ప్రధాని ప్రకటించారు. ఇందులో పెద్ద నోట్ల రద్దుతర్వాత ఎస్బీఐలో సుమారు1.5 లక్షల కోట్ల మేర నగదు డిపాజిట్ అయింది. అయితే ఎస్ బీఐ బాటలోనే మిగతా బ్యాంకులు కూడా డిపాజిట్ల వడ్డీ రేట్ల కోత పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.