సాక్షి, ముంబై: అతిపెద్దప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి లెండింగ్ రేట్లను తగ్గించింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్( ఈబీర్)ను 25 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో వినియోగదారులకు ఈబీఆర్ 8.05 నుంచి 7.80కి దిగి వచ్చిందని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన రేటు జనవరి 1వ తేదీ 2020 నుండి అమల్లోకి రానుంది. దీంతో రెపో రేటుతో అనుసంధానించిన గృహ రుణ వినియోగదారులకు ఈఎంఐ భారం తగ్గనుంది. అలాగే ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు)ల రుణ గ్రహీతలకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌లో వరుసగా ఎనిమిదో సారి కోత విధిస్తూ ఎస్‌బీఐ గత నెలలో 10 బీపీఎస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. కొత్త గృహ కొనుగోలుదారులకు సంవత్సరానికి 7.90 శాతం వడ్డీ రేటుతో రుణాలు లభిస్తున్నాయి. తాజా ప్రకటనలతో ఈక్విటీ మార్కెట్లో ఎస్‌బీఐ షేరు 2 శాతం నష్టాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment