మొండి బకాయిలను ఎస్‌బీఐ ఏం చేసింది?
మొండి బకాయిలను ఎస్‌బీఐ ఏం చేసింది?
Published Wed, Nov 16 2016 2:05 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
న్యూఢిల్లీ: దేశ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో ఉన్న రుణ బకాయిలను వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా చూసుకుంది. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతించిన పద్ధతి అయిన 'అడ్వాన్స్ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)' అనే పద్ధతిని అవలంబించింది. దీని ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. తద్వారా బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు అవుతుంది. కానీ, అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్‌టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిని 'ఆకా'లో యథాతథంగా ఉంచుతారు. అంటే, చిట్టచివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుంది.
ఈ పద్ధతిలో మొత్తం 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.7,016 విలువ చేసే నిరర్థక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ మేరకు డైలీ న్యూస్ & అనాలిసిస్ బుధవారం ఒక కథనం ప్రచురించింది.
ఇలా చేసిన రుణాలలో... విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫియర్ ఎయిర్ లైన్స్ బకాయిలు రూ 1,201 కోట్లు కూడా ఉన్నాయి. మొండిబకాయిల జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అగ్రస్థానంలో ఉంది. మరికొన్ని తెలుగు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.93.91 కోట్లు
విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 66.57 కోట్లు
కెఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు
ఘన్ శ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.61.72 కోట్లు
తెలంగాణ
తోటెం ఇన్ ఫ్రా లిమిటెడ్ రూ. 93.68కోట్లు
ఎస్ఎస్బీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ రూ.65.24 కోట్లు
వీటితోపాటు కేఎస్ ఆయిల్ (రూ 596 కోట్లు), సూర్య ఫార్మాస్యూటికల్స్ (రూ 526 కోట్లు) జీఈటీ పవర్, (రూ .400 కోట్లు) సాయి అండ్ ఇన్ఫో సిస్టమ్ (రూ 376 కోట్లు) ఉన్నాయి. 63 ఖాతాలను పూర్తిగా ఆకాలోకి మళ్లించగా, 31 ఖాతాలను పాక్షికంగా మళ్లించినట్లు తెలిపింది. ఆరింటిని మొండి బకాయిలుగా చూపించారు. ఈ తరలింపు ద్వారా దాని బ్యాలెన్స్ షీట్లు సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement