ఆస్తుల చిట్టా ఇవ్వాల్సిందే..
♦ 21 వరకూ మాల్యాకు సుప్రీంకోర్టు గడువు
♦ రూ. 4,000 కోట్ల చెల్లింపు ఆఫర్‌ను
♦ బ్యాంకులు తిరస్కరించిన నేపథ్యం...
♦ కోర్టు ముందు ఎప్పుడు హాజరవుతారో చెప్పాలనీ సూచన
♦ 26న తదుపరి విచారణ
న్యూఢిల్లీ: పీకల్లోతు బ్యాంకింగ్ అప్పుల్లో కూరుకుపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా తన, అలాగే తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఈ నెల 21వ తేదీలోపు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశ, విదేశాల్లోని ఆస్తుల వివరాలన్నింటినీ తెలియజేయాలని స్పష్టం చేసింది. తన ముందు ఎప్పుడు హాజరవుతారో తెలియజేయాలని కూడా సుప్రీం పేర్కొంది. కేసు తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది. ఇవ్వాల్సిన మొత్తంలో రూ.4,000 కోట్లు చెల్లించడానికి సిద్ధమని మాల్యా చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకింగ్ గ్రూప్ విన్నవించిన నేపథ్యంలో జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని బెంచ్ తాజా ఆదేశాలు ఇచ్చింది.
మాల్యా ఇస్తున్న ఆఫర్ రూ.4,000 కోట్లు ఇవ్వాల్సిన దానిలో సగంకూడా లేనందువల్ల ఈ ఆఫర్ ఎంతమాత్రం ఆమోదనీయం కాదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకులకు బకాయి వున్న రుణ మొత్తం రూ.6,903 కోట్లలో (వడ్డీకాకుండా) రూ. 4,000 కోట్లు తిరిగి చెల్లించేస్తానని గతంలో మాల్యా సుప్రీంకోర్టుకు విన్నవించారు. వివిధ వ్యాపార వివాదాలకు సంబంధించి తాము దాఖలు చేసిన కేసుల్లో రావాల్సివున్న మొత్తం వస్తే, మరో రూ.2,000 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించారు. అయితే వడ్డీలతో కలిపి మాల్యా వివిధ బ్యాంకులకు రూ. 9.000 కోట్లు బకాయివున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు గతంలో విన్నవించింది.
డిపాజిట్‌కూ ఆదేశం...
బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాలకు సంబంధించిన వివాదాన్ని అర్థవంతమైన సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడం పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ.. తగిన మొత్తాలను తన ముందు డిపాజిట్ చేయాలని మాల్యాను న్యాయస్థానం ఆదేశించింది. తన విశ్వసనీయతను నిరూపించుకోడానికి మాల్యా కోర్టు ముందు హాజరుకావడం తప్పనిసరని బ్యాంకింగ్ కన్సార్షియం చేసిన వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. కేసుపై న్యాయస్థానం దాదాపు 20 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలూ వింది. మాల్యా తరఫు వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ తన వాదనలు వినిపిస్తూ... రూ.4,000 కోట్ల చెల్లింపుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు బ్యాంకుల గ్రూప్ బుధవారం సాయంత్రమే తెలిపిందని, దీనిపై తన క్లెయింట్ తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.
కాగా కేసులో పార్టీగా చేరి తన వాదనలు వినిపించడానికి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. మాల్యా గ్రూప్ సంస్థలకు రుణాలను అందజేసిన బ్యాంకింగ్ కన్సార్షియంలో ఎస్‌బీఐతో పాటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, యూకో బ్యాంక్, దేనా బ్యాంకులు ఉన్నాయి. ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి.
గోవాలో కింగ్‌ఫిషర్ విల్లా జప్తుపై విచారణ...
ఉత్తర గోవాలోని కన్‌డోలియం గ్రామం వద్ద ఉన్న కింగ్‌ఫిషర్ విల్లా జప్తునకు సంబంధించి బ్యాంకింగ్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టినట్లు కలెక్టర్ నీలా మోహనన్ గురువారం పేర్కొన్నారు. కేసు న్యాయ విచారణ పరిధిలో ఉన్నందున ఇంతకుమించి వివరాలను వెల్లడించలేదు. బ్యాంకర్ల దరఖాస్తును పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోడానికి బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ ఇంతక్రితం జిల్లా పాలనా యంత్రాంగానికి మే 2016 వరకూ గడువిచ్చింది.