
వాట్సప్, ఫేస్‌బుక్ ఎక్కువగా వాడొద్దన్నందుకు...
కోయంబత్తూర్: సామాజిక మాధ్యమంలో ఎక్కువ సమయం గడుపుతున్నావంటూ భర్త మందలించినందుకు కోయంబత్తూరులో ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కుమార్ అనే లారీ డ్రైవర్ తన భార్య అపర్ణ (20) ఎప్పుడు చూసినా.. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో ఆన్‌లైన్లో ఉంటుందని గుర్తించాడు.
సోమవారం దీనిపై ఇద్దరి మధ్య మాటామాటా పెరగటంతో.. కుమార్ భార్యను మందలించాడు. తర్వాత ఆమె వాడుతున్న ఫోన్‌ను లాగేసుకున్నాడు. దీంతో అపర్ణ వేరే సెల్‌తో తమ్ముడికి ఫోన్ చేసి.. జరిగిందంతా చెప్పి.. లోపలినుండి గడియ పెట్టుకుని పైకప్పుకు ఉరేసుకుంది. తర్వాత తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వచ్చిన కుమార్ భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె ప్రాణం పోయింది.
భార్య మరణంతో కుంగిపోయిన కుమార్ కూడా ఇంటిపైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే బంధువులు ఆయన్ను రక్షించారు.