నోటీస్ ఇస్తే అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్తా: దిగ్విజయ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీయే ఎంపిక చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విభజన అంశం చర్చలో ఉన్నందున అభ్యర్థుల ఎంపికకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం అయిన తర్వాతే ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులపై దృష్టి పెడతామన్నారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై ఎవరైనా సరే సవరణలు ప్రతిపాదించుకోవచ్చని, తనవైపు నుంచి ఏమైనా పొరపాటు ఉంటే ప్రివిలేజ్ మోషన్‌కు వివరణ ఇస్తానని దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ఉండదని తానెప్పుడూ చెప్పలేదన్నారు. దీనిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తే అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్తానని దిగ్విజయ్ అన్నారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సవరణలు ప్రతిపాదించవచ్చని,అంతేకాని సభను అడ్డుకోవటం ద్వారా సాధించేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమేనని...ఓటింగ్ ఉండదని దిగ్విజయ్ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఆయనపై సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.