
ఆంటోనీ కమిటీతో భేటీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: ఆంటోనీ కమిటీని కలవడానికి సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. కమిటీని కలవడానికి ఆసక్తి ఉన్న సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనకు అవి అంగీకరించాయి. బుధవారమిక్కడ జరిగిన ఉపసంఘం భేటీకి ఉప ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే హాజరయ్యారు. ఏపీఎన్జీవో సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఆనం మాట్లాడారు. రాజనర్సింహ దాదాపు మౌనంగానే ఉన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఉపసంఘం మాత్రం దాని మీద కాకుండా ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన సమస్యలపైనే ఆసక్తి కనపరిచింది. సమ్మె విరమించాలని, స్వాతంత్య్రవేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో గురువారం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించారు. ఆంటోనీ కమిటీతో భేటీకి ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందాలను ప్రభుత్వమే ఢిల్లీకి తీసుకెళుతుందా లేక అపాయింట్‌మెంట్ ఇప్పించడానికే పరిమితమవుతుందా అనే విషయంలో మంత్రులు స్పష్టత ఇవ్వలేదు.
ఢిల్లీ ఎవరు వెళ్లేది రేపు గుంటూరులోప్రకటన
మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ రాజకీయ కమిటీనే అయినా అధికార పార్టీకి సంబంధించినది కాబట్టి కలవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈనెల 16న గుంటూరులో జరిగే అన్ని సంఘాల సమావేశంలో ఢిల్లీ యాత్రకు ఏఏ సంఘాల ప్రతినిధులు వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? అనే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏం మాట్లాడారంటే..
ఏపీఎన్జీవోలు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లలేదు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగాం. ఉద్యోగులంతా ఒక్కతాటి మీద నిలబడి సమ్మె చేసిన సందర్భం ఇప్పటివరకు చరిత్రలోనే లేదు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్: మంత్రుల భార్యలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తేనే ఖబడ్దార్ అంటున్న పరిస్థితి ఉంది. సమైక్య నిర్ణయం వచ్చే వరకు ఉద్యమం ఆగదు.
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం: ఉద్యోగుల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి.
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం: కమిటీ ముందు హాజరు కావటంపై చర్చించి నిర్ణయిస్తాం.