రాజధానిలో నినాదాల హోరు
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో రాజధాని హోరెత్తుతోంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ, సమైక్యవాదుల మధ్య మంగళవారం కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరస్పర వాగ్వాదాలు, ఆరోపణలు, ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్, విద్యుత్‌సౌధ, దేవాదాయశాఖ కార్యాలయం, కోఠి డీఎంహెచ్‌ఎస్, బీమాభవన్, తదితర కార్యాలయాల్లో పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
ఏపీఎన్జీవో నేతృత్వంలో బీఆర్‌కే భవన్‌లో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన కొనసాగిస్తుండగా, శాంతిసద్భావన ర్యాలీ పేరుతో తెలంగాణవాదులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు చేసిన ‘జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర’ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సెంట్రల్‌జోన్ డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని రెండు వర్గాలకు నచ్చచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
విద్యుత్‌సౌధలో నాగం హడావుడి: విద్యుత్‌సౌధలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్ద న్‌రెడ్డిని పోలీసులు విద్యుత్‌సౌధ గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సీమాంధ్ర తొత్తులుగా మారి తెలంగాణవాదులను అణచివేయాలని చూస్తున్నారంటూ నాగం మండిపడ్డారు. అరగంటపాటు గేటు ముందు బైఠాయించిన నాగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం సంతోష్ అనే తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేస్తే వారిపై చర్యలు తీసుకోలేదని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రఘు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డితో కలిసి విద్యుత్ ఉద్యోగులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్‌భవన్‌లో కవిత: తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత నిబద్ధత ఉందని, సీమాంధ్ర ఉద్యమం రాద్ధాంత ఉద్యమమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదనే నమ్మకం ఉందని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంటే ఈ ప్రాంత ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతంగా చేయాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో బస్ భవన్ వద్ద చేపట్టిన ధర్నాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కమిషనర్ ఆఫీసులో ఏపీఎన్జీవో ఉద్యోగులు విధులు బహిష్కరించి మౌనప్రదర్శన నిర్వహించారు. వీరికి పోటీగా భోజన విరామంలో టీఎన్జీవోస్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ ధర్నా నిర్వహించారు.