ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
పిటిషనర్‌కు హైకోర్టు ప్రశ్నలు
విచారణ నేటికి వాయిదా
హైదరాబాద్: ‘ప్రభుత్వోద్యోగులు తమ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేస్తే తలెత్తే పరిణామాలేమిటి? వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఈ విషయంలో ప్రభుత్వానికున్న బాధ్యత, అధికారం ఏమిటి?’’ అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మూడింటికీ పూర్తి వివరాలతో సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాలని పిటిషనర్‌ను ఆదేశించింది. రాజకీయాంశమైన రాష్ట్ర విభజనపై సమ్మె చేసే హక్కు ప్రభుత్వోద్యోగులకు లేదంటూ రవికుమార్ అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం దీనిపై సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఏపీ ఎన్జీవోల పేరుతో ప్రభుత్వోద్యోగులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. వారికి సమ్మె చేసే హక్కు లేదని కోర్టుకు నివేదించారు.
సుప్రీంకోర్టు 2003లో ఈ మేరకు స్పష్టమైన తీర్పు వెలువరించిందన్నారు. తమిళనాడు ప్రభుత్వం 2 లక్షల మంది ప్రభుత్వోద్యోగులను సర్వీసు నుంచి తప్పించడంపై సుప్రీం ఇచ్చిన తీర్పును చదివి విన్పించారు. కారణాలేవైనా ప్రభుత్వోద్యోగులు మాత్రం సమ్మె చేయడానికి వీల్లేదని అందులో కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ‘‘ఆగస్టు 12 నుంచి రాష్ట్రంలో ఏపీ ఎన్జీవోలు చేస్తున్న నిరవధిక సమ్మె వల్ల జనజీవనం స్తంభించింది. ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం వేసిన మంత్రుల బృందం ఒక్కసారి కూడా ఆ పని చేయలేదు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని చెప్పడమే తప్ప సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఏపీ ఎన్జీవోలు, సమ్మె చేస్తున్న ఇతర ప్రభుత్వోద్యోగులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’’ అని ఆరోపించారు.
అలా కుమ్మక్కైందని అఫిడవిట్‌లో ఎక్కడైనా రాశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అఫిడవిట్‌లో రాయలేదని, ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానంగా దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో రాశామని సత్యంరెడ్డి చెప్పగా, ‘రిప్లై అఫిడవిట్‌తో మాకు సంబంధం లేదు. అఫిడవిట్‌లో ప్రస్తావించని అంశాల గురించి మాట్లాడొద్దు. వాటిని మేం పరిగణనలోకి తీసుకోబోం. మీరు చెప్పేదేమిటి? సమ్మె చేస్తున్న వారి విషయంలో ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడం లేదంటారు. సంక్షోభాన్ని పరిష్కరించాలని కోరుతున్నారు. అంతేనా?’’ అని ప్రశ్నించింది. అవునని సత్యంరెడ్డి బదులిచ్చారు.
సమ్మె వల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందని, వ్యవహారాలన్నీ గందరగోళంగా తయారయ్యాయని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఫిడవిట్‌లో ఎక్కడ చెప్పారో చూపాలని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది. అసలిలాంటి పరిస్థితుల్లో కోర్టులు ఏం చేయగలవో చెప్పాలని కోరింది. సమ్మెను ఆపాల్సిందిగా ప్రభుత్వోద్యోగులను, తన బాధ్యతలను నిర్వర్తించి తీరాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చని సత్యంరెడ్డి బదులిచ్చారు. దాంతో, ‘అసలు సమ్మె విషయంలో జోక్యం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఎక్కడుంది? ప్రభుత్వానికి ఏ రకమైన బాధ్యతలు ఉంటాయో చెప్పండి. వాటి గురించి ఎక్కడ రాసి ఉందో చూపండి’ అని ధర్మాసనం కోరింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.