రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 రోజుల నుంచి వరుసగా సమ్మెలు జరుగుతూనే ఉండటంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీకి వాటిల్లిన నష్టం ఎంతో తెలుసా.. అక్షరాలా 200 కోట్ల రూపాయలు!! కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతుండటం, ఆర్టీసీ సిబ్బంది కూడా సమ్మెలో ఉండటంతో బస్సులు ఒక్కటి కూడా సరిగా నడవడం లేదు. మొత్తం 13 జిల్లాల్లోని ఆర్టీసీ సిబ్బంది సహా దాదాపు 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు సమ్మె బాటలో ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలన్న ఏకైక డిమాండుతో వీరు సమ్మె చేస్తున్నారు.
ఉద్యోగులు చేస్తున్న ఈ సమ్మె వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీకి అక్షరాలా రోజుకు 13 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్న ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటివరకు సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ఆర్టీసీకి దాదాపు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనలు మరింతకాలం కొనసాగితే ఆర్టీసీ మనుగడ కూడా కష్టంగా మారుతుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో ఉందని ఆయన తెలిపారు. అందువల్ల ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించి వెంటనే విధులకు హాజరై, ప్రజలకు అసౌకర్యం లేకుండా, ఆర్టీసీకి నష్టాలు రాకుండా చూడాలని ఖాన్ విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులు సమ్మె చేసినా, రూపాయి విలువ పడిపోవడం వల్ల డీజిల్ ధరలు పెరిగినా, ఏం జరిగినా కూడా చివరకు చిల్లు పడేది మాత్రం ప్రయాణికుల జేబుకే. ఎందుకంటే, నష్టాలను భరించడానికి ప్రభుత్వం ఎటూ ముందుకు రాదు కాబట్టి, ఆ నష్టాలను మళ్లీ ప్రజల మీదనే చార్జీల రూపంలో ఆర్టీసీ రుద్దడం ఖాయం.
సమైక్య సమ్మెతో ఆర్టీసీకి 200 కోట్ల నష్టం
Published Fri, Aug 23 2013 4:24 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
Advertisement
Advertisement