స్టాక్ మార్కెట్లను మంగళవారం అమంగళమై ఉరిమింది. దీనికి రూపాయి మహా పతనం పిడుగుపాటులా జత కలిసింది. ఇదిచాలదన్నట్లు ఆహార భద్రత బిల్లువల్ల పెరగనున్న సబ్సిడీ ఆందోళనలు పెనుతుపానులా చెలరేగాయి. ఇంకేముంది? ఒక్కసారిగా దెబ్బతిన్న సెంటిమెంట్‌తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్రారంభంనుంచీ అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో సెన్సెక్స్ 590 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ ఏడాది కనిష్టాన్ని తాకింది. ఒక్క రోజులో
రూ. 1.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది!!
నిరంతర పతనంతో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న దేశీ కరెన్సీ స్టాక్ మార్కెట్లను కూడా వణికిస్తోంది. ఇదివరకు ఎన్నడూ ఎరుగని విధంగా డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతుండటంతో ఉదయం నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. చరిత్రలోలేని విధంగా మిడ్ సెషన్‌లో 2.7% పతనమై 66కుపైగా పడిపోయిన రూపాయి దెబ్బకు సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు సోమవారం రాత్రి లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పటికే కరెంట్ ఖాతాలోటుతో కుదేలైన ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింత పెరుగుతుందన్న ఆందోళనలు కూడా దీనికి జత కలిశాయి.
వెరసి సెన్సెక్స్ 590 పాయింట్లు కుప్పకూలి 18,000 దిగువ కు చేరింది. గత మూడు రోజుల్లో ఆర్జించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయి 17,968 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 189 పాయింట్లు కోల్పోయి 5,300 దిగువన 5,287 వద్ద స్థిరపడింది. ఇది ఏడాది కనిష్టం. నిఫ్టీ అంతక్రితం 2012 సెప్టెంబర్ 6న మాత్రమే ఈ స్థాయిలో ముగిసింది. కాగా, ఏ దశలోనూ కోలుకోని రూపాయి ట్రేడింగ్ ముగిసేసరికి ఏకంగా 3%(194 పైసలు) పడిపోయి కొత్త రికార్డును నెలకొల్పింది! ఫలితంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 66.24 వద్ద నిలిచింది!!
చమురు మంటలు...
మధ్యప్రాచ్యంలో చెలరేగిన అశాంతి నేపథ్యంలో చమురు ధరలు 5 నెలల గరిష్టానికి చేరడంతో దిగుమతుల బిల్లు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీల ఉపసంహరణ త్వరలో మొదలుకావచ్చునన్న అంచనాలు కూడా మూకుమ్మడి అమ్మకాలకు కారణమయ్యాయని విశ్లేషించారు. కాగా, రూ. 1.83 లక్షల కోట్ల విలువైన 27 ప్రాజెక్ట్‌లకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయడాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుంటుందన్న భరోసా ఇచ్చినప్పటికీ మార్కెట్లు పెడచెవిన పెట్టాయి. తయారీ రంగంతోపాటు, పెట్టుబడుల వాతావరణం మెరుగుపడటం మొదలైతే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుందని ఆశావహంగా చెప్పినప్పటికీ ఇన్వెస్టర్లు అమ్మకాలను ఆపకపోవడం గమనార్హం.
పాతాళమే హద్దు...
బీఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య కుప్పకూలాయి. ఐటీ ఒక్కటే కాస్త నిలదొక్కుకుంది. మొండి బకాయిల భారంతో బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధికంగా 5.5% పతనంకాగా, బ్యాంక్ షేర్లన్నీ నష్టపోయాయి. ఇక క్యాపిటల్ గూడ్స్, పవర్, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు సైతం 5-3% మధ్య పడిపోయాయి. బ్యాంక్ షేర్లలో యస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, ఫెడరల్, బీవోఐ, యాక్సిస్, యూనియన్, కెనరా, పీఎన్‌బీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ 10-2.5% మధ్య పడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌లో కేవలం ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సెసా గోవా నిలదొక్కుకోగా, భెల్ 10% కుప్పకూలింది. ఈ బాటలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, జిందాల్ స్టీల్, హిందాల్కో, భారతీ, మారుతీ 8-4% మధ్య దిగజారగా, ఇండెక్స్ హెవీవెయిట్స్ ఐటీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్, ఆర్‌ఐఎల్ సైతం 3.5-2% మధ్య తిరోగమించాయి.
ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మొత్తం స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో రూ. 1.7 లక్షల కోట్లు హరించుకుపోయింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% క్షీణించాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,538 నష్టపోగా, కేవలం 719 బలపడ్డాయి. సోమవారం రూ. 607 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 1,374 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. దేశీయ ఫండ్స్ రూ. 480 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. మిడ్ క్యాప్స్‌లో ఐడీఎఫ్‌సీ మరోసారి 17% నేలకూలగా, జేపీ పవర్, పటేల్ ఇంజినీరింగ్, జేపీ అసోసియేట్స్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, పీఎఫ్‌సీ, సింటెక్స్, ఫైనాన్షియల్ టెక్, ఆర్‌ఈసీ, స్పైస్‌జెట్, శ్రీరాం ట్రాన్స్, ఆదిత్యబిర్లా నువో, హింద్ కాపర్ తదితరాలు 9-7% మధ్య పడ్డాయి.
బీఎస్‌ఈలో 177 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఏసీసీ వంటి బ్లూచిప్స్ ఉన్నాయి!
బీఎస్‌ఈలో రూ. 2,065 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో రూ. 12,078 కోట్లు చొప్పున టర్నోవర్ జరిగింది. ఎన్‌ఎస్‌ఈ ఎఫ్‌అండ్‌ఓలో రూ. 2,93,346 కోట్లు నమోదైంది. కడపటి వార్తలందేసరికి యూఎస్‌లోని డోజోన్స్, ఎస్‌అండ్‌పీ-500, నాస్‌డాక్ సూచీలు 1% క్షీణించి ట్రేడవుతున్నాయి. ఇక యూరప్‌లోని యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్లు 1-3% మధ్య నష్టపోయాయి.