మిడ్‌క్యాప్స్ హవా సెన్సెక్స్ 124 పాయింట్లు
మిడ్‌క్యాప్స్ హవా సెన్సెక్స్ 124 పాయింట్లు
Published Fri, Aug 9 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
గురువారం ట్రేడింగ్‌లో అటు రూపాయితోపాటు ఇటు స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. కరెన్సీకి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలను తీసుకోనుందన్న అంచనాలు రూపాయికి బలాన్నివ్వగా, జూలై నెలకు చైనా వాణిజ్య గణాంకాలు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించింది. వెరసి సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 18,789 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి 5,566 వద్ద స్థిర పడింది. కాగా, ఇటీవల అమ్మకాల వెల్లువతో బేర్‌మంటున్న చిన్న షేర్లు వెలుగులో నిలవడం విశేషం! దీంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పురోగమించాయి.
ట్రేడైన షేర్లలో 1,381 లాభపడగా, కేవలం 867 నష్టపోయాయి. ఇక బుధవారం ట్రేడింగ్ ముగిశాక ఫలితాలను ప్రకటించిన ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ షేరు దాదాపు 28% దూసుకెళ్లి రూ. 359 వద్ద ముగిసింది. ఒక దశలో 34% జంప్‌చేసి రూ. 377 వద్ద గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,279 కోట్లు పెరిగి రూ. 15,206 కోట్లకు చేరింది. అంచనాలకు మించి నష్టాలను తగ్గించుకోవడంతో ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారని, మరోవైపు షార్ట్ కవరింగ్ కూడా ఇందుకు జతకలసిందని నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల్లో ఈ షేరు దాదాపు 18% పతనమైంది.
ఎఫ్‌ఐఐల అమ్మకాలు
వరుసగా రెండో రోజు ఎఫ్‌ఐఐలు నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. బుధవారం రూ. 351 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, తాజాగా రూ. 396 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 516 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మెటల్, రియల్టీ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా, సెన్సెక్స్‌లో హిందాల్కో, టాటా స్టీల్, సిప్లా 5% చొప్పున ఎగశాయి. ఈ బాటలో మారుతీ, భారతీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ 4-2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా, ఎస్‌బీఐ 3%పైగా తిరోగమించాయి.
నేడు మార్కెట్లకు సెలవు
ఈద్‌ఉల్‌ఫితర్(రంజాన్) సందర్భంగా శుక్రవారం(9న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలతోపాటు, ఫారెక్స్, కమోడిటీ టోకు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.
Advertisement
Advertisement