మార్కెట్‌పై వర్షాభావం ఎఫెక్ట్...
27,000 దిగువకు సెన్సెక్స్
351 పాయింట్ల నష్టంతో 26,837కు
101 పాయింట్ల నష్టంతో 8,135కు నిఫ్టీ
ముంబై: కరువు భయాలకు, నిరాశజనకమైన హెచ్‌ఎస్‌బీసీ సేవల రంగం గణాంకాలు తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ కుదేలైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,000 పాయింట్ల దిగువకు పతనమైంది. నిఫ్టీ ఇంట్రాడేలో 8,100 దిగువకు పడిపోయింది. అన్ని రంగాల షేర్లలో ముఖ్యంగా వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ, ఆర్థిక సంస్థల, ఫ్రంట్‌లైన్ ఎఫ్‌ఎంసీజీ షేర్ల కంపెనీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 351 పాయింట్లు క్షీణించి 26,837 పాయింట్ల వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 8,135 వద్ద ముగిశాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,012 పాయింట్లు క్షీణించింది. మే 7 తర్వాత ఇదే సెన్సెక్స్ కనిష్ట స్థాయి ముగింపు.
నెస్లే భారీ పతనం..: మ్యాగీ వివాదం కారణంగా నెస్లే షేర్ 9.21 శాతం పతనమై రూ.6,187కు పడిపోయింది. రూ.5,942 కోట్ల మార్కెట్ క్యాప్ కరిగిపోయింది. పునర్వ్యస్థీకరణ కారణంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ షేర్ 80 శాతం క్షీణించి రూ.110 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,501 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.18,913 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,26,233 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.728 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.413 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
వంద లక్ష కోట్ల దిగువకు..
ఇన్వెస్టర్ల సంపద బుధవారం వంద లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,012 పాయింట్లు క్షీణించడంతో రూ.3 లక్షల కోట్ల మార్కెట్ విలువ అవిరైంది. బుధవారం నాడు బీఎస్ ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.98,83,222 కోట్లకు తగ్గింది.