పతనానికి బ్రేక్-205 పాయింట్ల ర్యాలీ
అనుకూల గ్లోబల్ సంకేతాలతో ఏడు రోజులపతనానికి బ్రేక్‌పడింది. అమెరికా మార్కెట్ మరో కొత్త గరిష్టస్థాయికి చేరడం, ఆసియా సూచీలు ర్యాలీ జరపడంతో గురువారం గ్యాప్‌అప్‌తో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒకదశలో 350 పాయింట్ల మేర పెరిగి 20,568 పాయింట్ల స్థాయికి చేరింది. అక్టోబర్ నెలలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఎనిమిదినెలల గరిష్టస్థాయికి పెరిగిందన్న వార్తల తో సెన్సెక్స్ గరిష్టలాభాల్లోంచి కొంతభాగాన్ని కోల్పోయి, చివరకు 205 పాయింట్ల పెరుగుదలతో 20,399 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 6,101 పాయింట్ల స్థాయికి చేరిన తర్వాత చివరకు 6,056 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే 67 పాయింట్లు లాభపడింది. ఇటీవల అదేపనిగా పడుతూ వచ్చిన బ్యాంకింగ్ షేర్లు గురువారంనాటి ర్యాలీకి అగ్రభాగాన నిలిచాయి.రూపాయి విలువ 63.11 స్థాయికి కోలుకోవడంతో ఐటీ షేర్లు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్‌లు, ఫార్మా షేర్లు సిప్లా, సన్‌ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్‌లు స్వల్పంగా తగ్గాయి.
ప్రైవేటు బ్యాంకింగ్ కౌంటర్లలో షార్ట్ కవరింగ్....
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వారి ఫోర్ట్‌ఫోలియోలను హెడ్జ్ చేసుకునేందుకు క్యారీ చేస్తున్న షార్ట్ పొజిషన్లలో కొన్నింటిని కవర్ చేసుకోవడంతో గురువారం ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. షార్ట్ కవరింగ్‌ను సూచిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కౌంటర్లలో ఫ్యూచర్ కాంట్రాక్టుల ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి వరుసగా 4.10 లక్షలు, 9.58 లక్షలు, 7 లక్షల షేర్ల చొప్పున కట్ అయ్యాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్ కాంట్రాక్టుకు సంబంధించి రూ. 1,040 నుంచి రూ. 1,100 స్ట్రయిక్స్ వరకూ కాల్ కవరింగ్ జరగడంతో కాల్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రస్ట్ తగ్గింది.
ఈ బ్యాంకింగ్ షేర్లతో పాటు టాటా మోటార్స్, టాటా స్టీల్ కౌంటర్లలో కూడా భారీ షార్ట్ కవరింగ్ జరగడంతో ఈ కాంట్రాక్టుల్లో ఓఐ 12.59 లక్షలు (6.61 శాతం), 17.87 లక్షల (9.2 శాతం) షేర్ల చొప్పున ఓఐ కట్ అయ్యింది. ఈ రెండు టాటా గ్రూప్ కౌంటర్లలో రూ.370 నుంచి రూ. 400 స్ట్రయిక్స్ వరకూ కాల్ కవరింగ్, భారీ పుట్ రైటింగ్ జరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేర్లు మరింత పెరగవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు వున్నారని ఈ డెరివేటివ్ డేటా సూచిస్తున్నది.