కదం తొక్కిన సెన్సెక్స్
రెండు రోజులపాటు ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. అమెరికా కేంద్ర బ్యాంకు నిర్వహించిన పాలసీ సమీక్షలో భాగంగా సహాయక ప్యాకేజీతోపాటు, వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో కొత్త జోష్ పుట్టుకొచ్చింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో షేర్లు, కరెన్సీలు, పసిడి కదం తొక్కాయి. దేశీయంగా సెన్సెక్స్ 684 పాయింట్లు దూసుకెళ్లి 20,647కు చేరింది. ఇది దాదాపు మూడేళ్ల గరిష్టంకాగా, రూపాయి 2.5% పుంజుకుని 62కు దిగువన 61.77 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధర ఔన్స్(31.1గ్రాములు)కు 59 డాలర్లు ఎగసి 1,366 డాలర్ల వద్ద నిలిచింది.
నెలకు 8,500 కోట్ల డాలర్లను వ్యవస్థలోకి పంప్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీకి కారణంగా నిలుస్తున్న ఫెడరల్ రిజర్వ్ ఇకపై కూడా ఈ ప్యాకేజీని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునేటంత వరకూ నామమాత్ర వడ్డీ రేట్లను కూడా యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడుతున్నట్లు స్పష్టం చేసింది. వెరసి తక్కువ స్థాయి వడ్డీకే లభిస్తున్న డాలర్ల నిధులు మరికొంతకాలం ఈక్విటీలలోకి మళ్లుతాయన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంకే ముంది? దీనికోసమే ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు ఒక్కుమ్మడిగా షేర్లలో కొనుగోళ్లకు దిగారు. ఫలితం... సెన్సెక్స్ 684 పాయింట్ల హైజంప్ చేసి 20,647ను చేరుకుంది. 2010 నవంబర్ 10 తరువాత ఇదే గరిష్ట స్థాయికాగా, నిఫ్టీ కూడా ఇదే స్థాయిలో 216 పాయింట్లు దూసుకెళ్లింది. 6,115 వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 1.83 లక్షల కోట్లు జమయ్యింది. ఈ విలువ 66.53 లక్షల కోట్లకు చేరింది. కాగా, ఇటీవలే కొత్త గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్ శుక్రవారం తొలిసారి పాలసీ సమీక్షను చేపట్టనున్నారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ తన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌కు ఊపునివ్వగా, రాజన్ ఎలాంటి జోష్‌ను తీసుకువస్తారో చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.
విశేషాలెన్నో....
ఆసియా: ఆసియా మార్కెట్లు దాదాపు 2-4.5% మధ్య పురోగమించాయి. అయితే చైనా, తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లు సెలవువల్ల ట్రేడ్‌కాలేదు.
యూరప్: యూరప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, యూకే సైతం 1%పైగా లాభాలతో ట్రేడవుతున్నాయి.
ఎఫ్‌ఐఐలు: గత మూడు రోజుల్లో కేవలం రూ. 1,200 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు దూకుడు పెంచి రూ. 3,544 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే దేశీయ ఫండ్స్ రూ. 1,830 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.
బ్యాంకెక్స్: యస్ బ్యాంక్ 22% జంప్‌చేయగా, యూనియన్, పీఎన్‌బీ, బీవోబీ, బీవోఐ, కెనరా, కొటక్ మహీంద్రా, ఎస్‌బీఐ, ఫెడరల్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం 10-5% మధ్య దూసుకెళ్లడం విశేషం! దీంతో బ్యాంకెక్స్ ఏకంగా 7% ఎగసింది.
రియల్టీ: ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్‌ఎఫ్, డీబీ, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా 9-3.5% మధ్య లాభపడటంతో రియల్టీ రంగం 5% పుంజుకుంది.
క్యాపిటల్ గూడ్స్: పుంజ్‌లాయిడ్, ఎల్‌అండ్‌టీ, పిపావవ్, క్రాంప్టన్, జిందాల్ సా, హవేల్స్, భెల్, సీమెన్స్ 7-3% మధ్య పురోగమించడంతో క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 5% లాభపడింది.
మెటల్స్: జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, సెసా గోవా, సెయిల్, హిందాల్కో 8-4% మధ్య పెరగడంతో మెటల్ ఇండెక్స్ 4% బలపడింది.
సెన్సెక్స్: మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, మారుతీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్, భారతీ, టాటా మోటార్స్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, ఆర్‌ఐఎల్ 6.5-2.5% మధ్య దూసుకెళ్లాయంటే సెంటిమెంట్ తీరును అర్థం చేసుకోవచ్చు.
ఒక్కటి మినహా: సెన్సెక్స్‌లో కేవలం విప్రో(2%) నష్టపోయింది.
చిన్న షేర్లు: మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 2-1% మధ్య పురోగమించగా ట్రేడైన షేర్లలో 1,430 లాభపడ్డాయి. కేవలం 997 బలహీనపడ్డాయి.
టర్నోవర్: ఎన్‌ఎస్‌ఈలో రూ. 18,130 కోట్లు, బీఎస్‌ఈలో రూ. 2,849 కోట్లు చొప్పున అధిక టర్నోవర్ నమోదైంది.
ఏడాది గరిష్టం: బీఎస్‌ఈ-500లో ఆర్‌కామ్ 12% జంప్ చేసి రూ. 161కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా, ఇండియాబుల్ హౌసింగ్ ఫైనాన్స్ 11% ఎగసింది. డెల్టా కార్ప్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, మ్యాక్స్, హెచ్‌ఎంటీ, జేపీ అసోసియేట్స్, ఐడీఎఫ్‌సీ, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్, ఎల్‌ఐసీ హౌసింగ్, ఏషియన్ పెయింట్స్, దేనా బ్యాంక్ తదితరాలు 11-7% మధ్య దూసుకెళ్లాయి.
రూపాయి 161 పైసలు జంప్
ముంబై: సహాయక ప్యాకేజీలను యథాతథంగా కొనసాగించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో దేశీయ కరెన్సీకి బలమొచ్చింది. డాలరుతో మారకంలో ఏకంగా 161 పైసలు(2.54%) పుంజుకుని 61.77వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టం కాగా, ఒక దశలో 61.64 వరకూ బలపడింది. నెలకు 85 బిలియన్ డాలర్లతో బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఫెడ్ భారీ నిధులను వ్యవస్థలోకి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొంత కాలం ఈ ప్యాకేజీలను కొనసాగించడంతోపాటు, వడ్డీ రేట్లను నామమాత్రస్థాయిలోనే ఉంచేందుకు నిర్ణయించడంతో వివిధ కరెన్సీలతో మారకంలో డాలర్ బలహీనపడింది.
వారం రోజుల గరిష్టానికి పసిడి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సానుకూల నిర్ణయాలతో పసిడి, వెండిలో సైతం కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో ఇక్కడి బులియన్ స్పాట్ మార్కె ట్లో పూర్తి స్వచ్చత(99.9) కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ. 270 పెరిగి రూ. 30,430కు చేరింది. ఇది వారం రోజుల గరిష్టస్థాయి. కాగా, 99.5% స్వచ్చత గల ప్రామాణిక పసిడి 10 గ్రాముల ధర కూడా రూ. 270 లాభపడి రూ. 30,280 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ ధర రూ. 945 ఎగసి రూ. 51,815కు చేరింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో పుత్తడి ఔన్స్(31.1గ్రాములు) ధర 59 డాలర్లు ఎగసి 1,366 డాలర్లను తాకింది. ఈ బాటలో వెండి ధర ఔన్స్‌కు 23 డాలర్లకు చేరింది.