ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రోజంతా లాభాలు,నష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ మార్కెట్లు చివరికి 100 పైగా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో 28,532 వద్ద, నిఫ్టీ35 పాయింట్ల లాభంతో 8809 వద్ద క్లోజ్ అయ్యాయి. దీంతోపాటుగా నిఫ్టీ 16 నెలల గరిష్టానికి చేరింది. ముఖ్యంగా ఆటో, షార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాల లాభాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి. హెచ్ డీ ఎఫ్సీ, మారుతిసుజుకి, సన్ ఫార్మా, ఐటీసీ టాటా మోటార్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
రోజంతా నారో బౌండ్ లో సాగిన మార్కెట్ లో ఒక్కసారిగా కొనుగోళ్ల జోరు నెలకొంది. యూరప్ మార్కెట్లు లాభాలతో మొదలుకావడంతో దేశీయంగా సెంటిమెంట్ బలపడింది. దీనికి ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు కలిసి వచ్చాయి. దీంతో సెన్సెక్స్ ఒకదశలో 151 పాయింట్ల వరకూ లాభపడింది. మారుతి, మహీంద్ర, మహీంద్ర, టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్ 1 నుంచి 2 శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే టెల్కోల షేర్లు నష్టాలనుంచి చివర్లో కొద్దిగా తేరుకున్నాయి.దీంతో భారతి ఎయిర్ టెల్ 6.4 శాతం, ఐడియా స్వల్పంగా లాభపడ్డాయి. చైనా కంపెనీ పీవీఆర్ వాటాలను కొనుగోలు చేయనుందన్న వార్తలతో ఈ కౌంటర్ దాదాపు 8 శాతం లాభపడింది. అదానీ పోర్ట్స్ 4 శాతం లాభపడగా, కోల్ ఇండియా, రిలయన్స్, ఏసీసీ, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి.
అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.12 పైసల లాభంతో 66.84 వద్ద ఉండగా, ఎంసీక్స్ లో పది గ్రాముల పుత్తడి 8 రూపాయల నష్టంతో రూ. 30,764 వద్ద వుంది.