
‘కశ్మీర్’ లేని చర్చలు వ్యర్థం
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్య
వాషింగ్టన్/ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ చర్చల్లో కశ్మీర్ వేర్పాటువాద నేతలది కీలక భూమికేనని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ఆ చర్చల్లో కశ్మీరీ నేతలను మూడో వర్గం(థర్డ్ పార్టీ)గా పరిగణించబోమన్నారు. భారత్‌తో చర్చలకు సంబంధించి.. కశ్మీర్ అంశంలేని ఏ చర్చలైనా ఫలప్రదం కాబోవని కుండబద్దలు కొట్టారు. కశ్మీరీలను సంప్రదించకుండా, వారి అభిప్రాయం తీసుకోకుండా వారి భవితవ్యాన్ని నిర్ణయించలేమని సోమవారం పాక్ కేబినెట్ భేటీలో షరీఫ్ వ్యాఖ్యానించారని పాక్ పత్రిక ‘డాన్’ పేర్కొంది.
జమాతుద్ దవాను పాక్ నిషేధించలేదు
ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వం వహిస్తున్న ఉగ్రవాద సంస్థ జమాతుద్ దవా(జేయూడీ)పై, అఫ్ఘానిస్తాన్‌కు చెందిన హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ నిషేధం విధించలేదు. 60 నిషేధిత సంస్థలతో కూడిన అధికారిక జాబితాలో ఆ ఉగ్రవాద సంస్థల పేర్లు లేవు. అయితే అధికారుల నిశిత పరిశీలనలో ఉన్న జాబితాలో మాత్రం జేయూడీ ఉంది. ఐరాస నిషేధించిన సంస్థల్లో అదొకటి. సయీద్‌ను పట్టించినవారికి కోటి డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అయినా, సయీద్ పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
మేం జోక్యం చేసుకోం.. అమెరికా: భారత్-పాక్ చర్చల పునరుద్ధరణలో తాము ఎలాంటి పాత్రా పోషించబోమని అమెరికా స్పష్టం చేసింది. చర్చలు ఎలా, ఏయే అంశాలపై జరగాలనే విషయాన్ని ఆ రెండు దేశాల నేతలే నిర్ణయించుకోవాలంది. అయితే, ఇరుదేశాల మధ్య జాతీయ భద్రత సలహాదారు స్థాయి చర్చలు నిలిచిపోవడం తమను నిరుత్సాహపరిచిందని పేర్కొంది. ‘ఇరుదేశాల నేతలు చర్చలను పునరుద్ధరించుకుని ఉగ్రవాదం సహా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం.
కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్తాన్‌లే ఆ సమస్యను పరిష్కరించుకోవాలన్న మా వైఖరిలో మార్పులేదు’ అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. రష్యాలోని ఉఫాలో భారత్, పాక్‌ల ప్రధానులు చర్చలపై ఒక అంగీకారానికి రావడం తమకు సంతోషం కలిగించిందని, అయితే, ఆ ప్రక్రియకు అంతరాయం కలగడం దురదృష్టకరమని అన్నారు.