ప్యారిస్ ఉగ్రదాడులు జరిగిందిలా..
ప్యారిస్: ఫ్రాన్స్ ఉగ్రవాద దాడుల్లో సుమారు 150 మందికి పైగా మరణించారు. మరో 300 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దాడులు జరిగిన తీరు ఇలా ఉంది...
మొదటగా టెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో కాల్పులు జరిగాయి. అత్యాధునిక తుపాకులు చేతపట్టుకున్న దుండగులు.. భోజనం చేస్తున్నవారిపై కాల్పులు జరిపారు. ఆ వెంటనే జాతీయ ఫుట్ బాల్ స్టేడియం స్టేడ్ డీ ఫ్రాన్స్ బయట మూడు శక్తిమంతమైన పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో ఫ్రాన్స్, జర్మనీల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరుతుండటంతో స్టేడియం కిక్కిరిసి ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోసిస్ హోలాండ్ కూడా అదే స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుండటం గమనార్హం. పేలుళ్ల శబ్ధంతో ఉలిక్కిపడ్డ అధికారులు.. అధ్యక్షుణ్ని సురక్షిత ప్రాంతానికి తరలించి, ప్రేక్షకులను అత్యవసరద్వారాలగండా బయటికి పంపేప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తోపులాటలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
మరి కాసేపటికే లెవెన్త్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ థియేటర్ లోకి చొరబడ్డ దుండగులు.. ప్రేక్షకులపై ఏకబిగిన కాల్పులు జరిపారు. ఇక్కడ కనీసం 15 మంది మరణించినట్లుగా భావిస్తున్నపోలీసులు.. వందలమందిని ఉగ్రవాదులు బందీలుగా తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సెంట్రల్ ఫ్రాన్స్ లోని బటాక్లాన్ కాన్సెర్ట్ హాలులోనూ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. అత్యధిక ప్రాణనష్టం ఇక్కడే జరిగినట్లు పోలీసులు తెలిపారు. చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయానికి ఈ ప్రాంతం కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. గత జనవరిలో చార్లీ హెబ్డో ఆఫీసులో జరిగిన ఉగ్రదాడిలో 17 మంది దుర్మణం చెందిన సంగతి తెలిసిందే. ఇక్కడికి సమీపంలోని ఓ కాంబోయియన్ రెస్టారెంట్ లోకీ చొరబడ్డ దుండగులు ముగ్గురిని హతమార్చారు.
వరుస కాల్పులు, పేలుళ్ల సంఘటనలతో అప్రమత్తమైన ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ దళాలు, క్యాబినెట్ మంత్రులు, పారిస్ మేయర్, ఇతర ఉన్నతాధికారులతో ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. పారిస్ లో ఉగ్రవాదుల దాడులను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. అమాయక ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారని, ఇది మానవత్వంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. కాల్పుల ఘటనపై యురోపియన్ యూనియన్ (ఈయూ) చీఫ్ జేన్ క్లౌడే జాంకర్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. గడిచిన ఏడాది కాలంగా ఫ్రాన్స్ లో చోటుచేసుకున్న కాల్పుల ఉదంతాల్లో 200 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవటం శోచనీయం.
కాగా, ఈ సంఘటనలకు బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థలేవీ ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంస్థపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్ దేశాలు మూకుమ్మడిగా దాడులు చేస్తుండటంతో.. తమ లక్ష్యం రష్యానే అని వాళ్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.