పట్నాలో ఆర్జేడీ భారీ సభ
సాక్షి, పట్నా: 'దేశ బచావో-బీజేపీ భాగవో' పేరిట రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆదివారం పట్నాలోని గాంధీ మైదానంలో భారీ సభను నిర్వహిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు పాల్గొంటున్నారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ సభకు గైర్హాజరు అవుతుండటం విపక్షాల్లో ఐక్యతపై అనుమానాలకు తావిస్తోంది.
ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన బిహార్ మహాకూటమి నుంచి తప్పుకొని.. తిరిగి బీజేపీతో చేతులు కలిపి నితీశ్‌కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సభ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సభలో జేడీయూ అసమ్మతి నేతలు శరద్ యాదవ్, అలీ అన్వర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జేడీయూ ఎంపీలైన ఈ ఇద్దరు అసమ్మతి నేతలు లాలూతోపాటు వేదిక పంచుకోనున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డీ రాజా, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు సభలో పాల్గొనున్నారు. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, తనయులు తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు సభ ప్రాంగణానికి చేరుకున్నారు.