న్యూటన్ థర్డ్ లా మర్చిపోవద్దు!
బీజేపీ నాయకత్వానికి శత్రుఘ్న సిన్హా సవాలు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనపై పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందన్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా తీవ్రంగా స్పందించారు. ధైర్యముంటే తనపై చర్య తీసుకోవాలంటూ పార్టీకి పరోక్ష సవాలు విసిరారు. ‘‘వ్యక్తిగత రాజకీయ లబ్ధి లక్ష్యంగా కొందరు చేసే అనధికార వ్యాఖ్యలపై నేను స్పందించాలనుకోవడం లేదు. అయితే, ఒక విషయం ఎవరూ మర్చిపోకూడదు.
‘ప్రతీ చర్యకూ దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది’ అన్న న్యూటన్ మూడో సూత్రాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ ఆ బీజేపీ రెబెల్ ఎంపీ మంగళవారం ట్వీట్ చేశారు. పార్టీ నాయకత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేసిన సిన్హా.. రాష్ట్రంలో తన ప్రాచుర్యంపై అసూయ పెంచుకున్న కొందరు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు తనకు వ్యతిరేకంగా పార్టీ అగ్రనాయకత్వానికి చాడీలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో బీజేపీ ప్రధాన ప్రచార కర్తగా ఉన్న తనకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్ కమిటీలో స్థానం లేకపోవడాన్ని, పార్టీ ప్రచార చిత్రాల నుంచి తన ఫొటోను తొలగించడాన్ని సిన్హా ప్రశ్నించారు. ప్రధాని మోదీ సాహసవంతుడని ప్రశంసించారు. తనను పిలిచి, అడిగితే రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన వాస్తవాలను మోదీ సహా అగ్ర నాయకత్వానికి వివరిస్తానన్నారు.