ఒర్లాండో: రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ గురువారం తాను ఎన్నికల్లో ఓడిపోతానేమోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒర్లాండో ప్రచారంలో రిపబ్లికన్ మినిస్టర్లతో సంభాషణలు జరిపిన ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోని ప్రతినిధులు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం బాధకరమని అన్నారు.
రాజకీయంగా తనకున్న అనుభవలేమి ఓటమికి కారణమయ్యే ప్రమాదం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పదవిని చేపట్టబోయే వ్యక్తికి ఐదుగురు హైకోర్టు జడ్జిలను నియమించే అవకాశం వస్తుందని.. అందులో సుప్రీంకోర్టుకు కూడా జడ్జి నియామకం కూడా ఉండబోతుందని చెప్పారు. ప్రత్యర్ధులు నామినేట్ చేసే జడ్జిల కారణంగా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని అన్నారు.
గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా వస్తున్న పోల్ ఫలితాల్లో హిల్లరీ క్లింటన్ లీడ్ లో ఉండటంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో క్లింటన్ కంటే కొద్ది పాయింట్లతో వెనకంజలో ఉండటంపై ఆయన స్పందించారు. ప్రస్తుతం తాను ఫాలో అవుతున్న సిద్ధాంతాన్నే ముందు ముందు కూడా అనుసరించబోతున్నట్లు చెప్పారు. చివరకు తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత లాంగ్ ట్రిప్ కు వెళ్లనున్నట్లు చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ పట్టు కలిగిన రాష్ట్రాలైన అరిజోనా, జార్జియా తదితరాలకు చెందిన పార్టీ ప్రతినిధులు ట్రంప్ వ్యాఖ్యల కారణంగా డెమొక్రటిక్స్ విజయం సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉటా రాష్ట్రంలో ట్రంప్ చేసిన ఛాలెంజ్ లు రిపబ్లికన్ ప్రతినిధులకు ఇబ్బందికరంగా మారాయి. కాగా తన వ్యాఖ్యలను తప్పుగా మార్చారని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
దీంతో ట్రంప్ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఆయనకు సాయం చేయకూడదని కొంతమంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు పార్టీ చైర్మన్ కు లేఖ ఇచ్చారు. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన ట్రంప్ ఒర్లాండోలో తాను ఓడిపోవచ్చనే వ్యాఖ్యలు చేసి రిపబ్లికన్లను తిరిగి ఆకర్షించే పనిలో పడ్డారు. తనను గెలిచేట్లు చూడాలని మతపెద్దలను కూడా ఆయన కోరారు.