
బీజేపీ యూటర్న్.. శివసేన ఫైర్
ముంబై: ఉప ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ యూటర్న్ తీసుకోవడం పట్ల ఎన్డీఏ కీలక భాగస్వామ్య పార్టీ శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని తప్పుబట్టింది. మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం నియామకానికి ససేమీరా అన్న కమలం పార్టీ ఇప్పుడు ఎందుకు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను పెట్టిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించే విధానం లేదని 2014లో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్టీ చెప్పిందని ఆయన వెల్లడించారు. పీడీపీ భాగస్వామ్యంతో జమ్మూకశ్మీర్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బీజేపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకుందని, తాజాగా యూపీలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిందని గుర్తు చేశారు. ఈ విషయంలో బీజేపీ విధానం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గోవాలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం తాత్కాలికమైందని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అదో అవినీతి కూటమని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీని గోవా ప్రజలు పూర్తిగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు.