న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.
ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.
అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment