ముఖ్యమంత్రికి చేదు అనుభవం!
పంజాబ్ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. బఠిండాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయనపై ఓ వ్యక్తి షూ విసిరాడు. బూటు నేరుగా వచ్చి ప్రకాశ్ సింగ్ బాదల్‌ను తగిలింది. దీంతో ఆయన చేతిలోని గ్లాస్ పగిలిపోయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని, ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని యథాతథంగా కొనసాగించారని భద్రతా అధికారులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని గురుబచన్ సింగ్‌గా గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం బాదల్‌పై షూ దాడి జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2014లో కూడా ఇలాగే దాడి జరిగింది. ఖన్నా జిల్లా ఇస్సులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి గతంలో షూ విసిరాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన తాజా ఘటనపై బాదల్ తనయుడు, డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మండిపడ్డారు. పంజాబ్‌ను మరో కశ్మీర్ మార్చాలని కుట్రపన్నుతున్నవారే.. సీనియర్ మోస్ట్ నాయకుడిపై ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.