ఫలితాలు, గణాంకాలే కీలకం..
న్యూఢిల్లీ: బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను నియంత్రించనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో గత వారం మొదలైన ఫలితాల సీజన్ ఈ వారం ఊపందుకోనుంది. ఐటీ దిగ్గజం టీసీఎస్, ఇంధన దిగ్గజం ఆర్‌ఐఎల్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తదితర కంపెనీలు ఈ వారం క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితోపాటు అంతర్జాతీయ సంకేతాలు, డాలరుతో రూపాయి మారకం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయనేది విశ్లేషకుల అంచనా. సమీప కాలానికి ఈ అంశాలన్నీ మార్కెట్ల దిశను నిర్దేశించనున్నాయని వ్యాఖ్యానించారు.
నిఫ్టీకి 6,130 కీలకం
ఈ వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి 6,130 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ స్థాయివద్ద స్వల్పకాలిక ట్రెండ్ నిర్ణయమయ్యే అవకాశముందని చెప్పారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరగవచ్చునని అంచనా వేశారు. కాగా, సోమవారం(13న) రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), బుధవారం(15న) టోకు ధరల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. మందకొడి వృద్ధి, ఆహార ధరలు దిగొచ్చే అవకాశం నేపథ్యంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఏంజెల్ బ్రోకింగ్ ఆర్థిక వేత్త భూపాలీ గుర్‌సాల్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 28న రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న సంగతి తెలిసిందే. సీపీఐ, డ బ్ల్యూపీఐ తగ్గనున్న అంచనాల మధ్య రిజర్వ్ బ్యాంక్‌కు రేట్ల కోతకు అవకాశం చిక్కుతుందని భూపాలీ చెప్పారు.
బజాజ్ ఆటో, యాక్సిస్ సైతం
ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో సైతం ఈ వారం క్యూ3 ఫలితాలను ప్రకటించనున్నాయి.