సింగర్ బాలుకు కేరళ సత్కారం
శబరిమలై: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో కలికితురాయి తోడైంది. కేరళ ప్రభుత్వం, శబరిమలై దేవస్థానం ఉమ్మడిగా అందించే ప్రతిష్ఠాత్మక 'హరివరాసనం' అవార్డును ఈ ఏడాదికిగానూ ఆయన అందుకున్నారు. శనివారం అయ్యప్ప సన్నిధానం శబరిమలై ఆలయంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎస్ శివకుమార్ నుంచి బాలు ఈ అవార్డును స్వీకరించారు. అవార్డుతోపాటు లక్ష రూపాయల నగదు బహుమానం, మెమొంటోను అందజేశారు. తన గానం ద్వారా ఆథ్యాత్మిక ఉన్నతికి పాటుపడినందుకుగానూ ఆయనను హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఐదు దశాబ్ధాల నా సంగీత ప్రస్థానంలో ఎన్నో అవార్డులను అందుకున్నాను. అయితే హరివరాసం మాత్రం వాటన్నింటిలోకి ప్రధానమైనదిగా భావిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆలయం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ. స్వామివారిని కీర్తిస్తూ హిందీ సహా అనేక భాషల్లో పాటలు పాడిన నేను మొదటిసారి శబరిమలకు రావడం ఆనందంగా ఉంది' అని అన్నారు.