
సిరిసిల్ల పై వేటు
కోడలు, మనవళ్ల మృతి కేసులో అరెస్టయ్యి.. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆదివారం తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. రాజయ్య మాజీ ఎంపీయే కావడం, ఏఐసీసీ సభ్యుడు కూడా కాకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకునే అధికారం పీసీసీకి ఉంది. పార్టీ హైకమాండ్ పెద్దలతో మాట్లాడిన అనంతరం రాజయ్యపై టీపీసీసీ చర్యలు తీసుకున్నట్టు సమాచారం.
సారిక, ఆమె పిల్లల మృతి కేసులో రాజయ్య జైలుకు వెళ్లడంతో ఆ ప్రభావం పార్టీపై పడే ప్రమాదం ఉందని నాయకులు కలవరపడ్డారు. రాజయ్యను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా దీన్ని ఓ అస్త్రంలా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్యపై చర్యలు తీసుకోకపోతే అది పార్టీకి అప్రతిష్టగా మారుతుందన్న కాంగ్రెస్ నాయకులు భావించారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ జైల్లో ఉన్నారు.