
కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల సస్పెన్షన్?
కోడలు, మనవళ్ల అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయ్యి.. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సారిక, ఆమె పిల్లల మృతి కేసులో రాజయ్య జైలుకు వెళ్లడంతో ఆ ప్రభావం పార్టీపై పడే ప్రమాదం ఉందని నాయకులు కలవరపడుతున్నారు. రాజయ్యను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండు చేస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా దీన్ని ఓ అస్త్రంలా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్యపై చర్యలు తీసుకోకపోతే అది పార్టీకి అప్రతిష్టగా మారుతుందన్న ఆందోళన నెలకొంది.
రాజయ్య మాజీ ఎంపీయే కావడం, ఏఐసీసీ సభ్యుడు కూడా కాకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకునే అధికారం పీసీసీకే ఉంటుంది. అయితే దానికి ముందుగా జిల్లా కాంగ్రెస్ నుంచి నివేదిక రావాల్సి ఉంటుంది. దాన్ని పీసీసీ క్రమశిక్షణ సంఘానికి రిఫర్ చేసిన తర్వాత, వాళ్లు చెప్పేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి. కానీ అసలు ఇప్పటివరకు జిల్లా పార్టీ విభాగం నుంచి ఎలాంటి నివేదిక అందలేదు. ప్రస్తుతం రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ జైల్లో ఉన్నారు. దాంతో త్వరగా జిల్లా పార్టీ విభాగం నుంచి నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం మేలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.