అన్నదాతలకు.. అప్పుల ఉరితాళ్లు
అప్పుల బాధతో ఆరుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్‌వర్క్ : నమ్ముకున్న భూమిలో పంట సాగుచేసినా, ప్రకృతి వైపరీత్యంతో చేతికందక.. నట్టేట ముంచుతోంది. ఆరుగాలం క ష్టపడుతున్న అన్నదాతలకు చివరకు అప్పుల ఉరితాళ్లే మిగులుతున్నాయి. శనివారం తెలంగాణలో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకోగా, మరొక మహిళా రైతు గుండెపోటుతో మృతి చెందింది.
వరంగల్ జిల్లాలో...
పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన పెండ్లి రాజేందర్(35), కేసముద్రం మండలం అర్పనపల్లి శివారు కిష్టాపురం తండాకు చెందిన జాటోత్ మోహన్(35), చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన అనువూండ్ల రాజు(28)లు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో...
హా మోర్తాడ్ మండలం తాళ్లరాంపూర్‌కు చెందిన రైతు పొనుగంటి గంగారాం(50) తనకున్న ఆరు ఎకరాల పంట పొలానికి నీటిని అందించేందుకు పదిరోజుల వ్యవధిలో 20 వరకు బోర్లు వేశాడు. ఏ ఒక్క దానిలో నీరు రాకపోవడంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్ జిల్లాలో..
జైనథ్ మండలంలోని జామ్ని గ్రామ పంచాయతీ పరిధి జున్నపాని గ్రామానికి చెందిన రైతు మడావి భీంరావ్(32) తనకున్న ఐదెకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. వారం క్రితం కురిసిన వర్షాలకు పంట నేలకొరగడంతో అప్పులు తీర్చే మార్గం కనపడక పురుగుల మందు తాగాడు.
రంగారెడ్డి జిల్లాలో...
రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రాఘవాపూర్‌కు చెందిన చిన్న కుర్వ శ్రీశైలం (38) ఖరీఫ్‌లో మొక్కజొన్న, పత్తి పంట వేశాడు. పెట్టుబడి, ఇతర అవసరాల కోసం చేసిన అప్పులు చేశాడు. అప్పులు పెరగడంతో గతేడాది శ్రీశైలం భార్య యాదమ్మ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మళ్లీ అప్పులు తీర్చేమార్గం కనిపించక శ్రీశైలం గురువారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గతంలో శ్రీశైలం తండ్రి, తమ్ముడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గుండెపోటుతో మహిళా రైతు మృతి
మహబూబ్‌నగర్ జిల్లా నర్వ పట్టణానికి చెందిన పేరూరి రాములమ్మ (48) తనకున్న మూడున్నర ఎకరాల పొలంతోపాటు, పక్కనే ఉన్న 16 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం రూ.15 లక్షల వరకు అప్పు చేసింది. పంటలకు చీడపీడలు సోకడంతో, అప్పులు తీర్చలేమోనని దిగులు చెందింది. ఛాతీలో నొప్పి వస్తుందని ఆస్పత్రికి తీసుకెళ్లగా కన్నుమూసింది.