బోనకల్/ టేకులపల్లి, న్యూస్‌లైన్: ఆర్థిక ఇబ్బందులు ఇద్దరు రైతులను బలితీసుకున్నాయి. సరైన దిగుబడి రాక, పండిన పంటలకూ గిట్టుబాటు ధర లేక అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు. ఉరివేసుకుని ఒకరు, పురుగుమందు తాగి మరొకరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. బోనకల్, టేకులపల్లి మండలాల్లో జరిగిన ఈ విషాద ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి...
బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ (55) కు ఎకరంన్నర భూమి ఉంది. దీనికి తోడు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేయగా.. దిగుబడి సక్రమంగా రాలేదు. గత ఏడాది కూడా తన భూమితో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ వేశాడు. అయితే సాగర్ నీరు సకాలంలో అందక పంటంతా ఎండిపోయింది. ఇలా రెండు సంవత్సరాలకు కలిపి
రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఇది తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఉద్దండు.. శనివారం ఉదయం రోజూలాగే పొలానికి వెళ్లి అక్కడే వేపచెట్టుకు ఉరివేసుకుని బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఉద్దం డుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబపెద్దను కోల్పోవడంతో వారు వీధిన పడ్డారు. మండల వ్యవసాయాధికారి సరిత, ఎస్సై పెద్దిరెడ్డి రామకృష్ణారావు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
టేకులపల్లిలో...: టేకులపల్లి మండల కేంద్రంలోని దాస్‌తండాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండాకు చెందిన జర్పుల సీతారాం(48) ఆరు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం టేకులపల్లికి వలస వచ్చాడు. సొంత భూమి లేకపోవడంతో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేయగా.. దిగుబడి సక్రమంగా రాక భారీ నష్టం వాటిల్లింది. అంతకుముందు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడి పెళ్లిళ్లు, ఇంటి నిర్మాణ ఖర్చుల కోసం చేసిన అప్పు.. మొత్తం రూ. 9 లక్షలకు చేరింది. దీనికి వడ్డీలు కూడా అధికం అవుతుండడంతో ఇంటిని అమ్మి కొంతమేర అప్పు తీర్చాడు. ప్రస్తుతం దాస్‌తండాలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
కాగా, ఈ ఏడాది మూడెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి వేశాడు. ఇందుకోసం మరో రూ. రెండు లక్షలు అప్పు చేశాడు. ఇలా రుణబాధలు పెరుగుతుండడంతో తమ మధ్య తరచూ వాగ్వాదం జరుగుతుండేదని, ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఎప్పుడూ అనేవాడని భార్య సరోజ రోదిస్తూ చెప్పింది. ఈ క్రమంలో అప్పులు తీర్చలేమనే మనోవ్యథతో ఉన్న సీతారాం.. శనివారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భర్తకు భోజనం తీసుకుని పొలానికి వెళ్లిన సరోజ సీతారాం మృతదేహాన్ని చూసి భోరున విలపించింది. ఆర్‌ఐ జామ్లా, వీఆర్వో కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఇల్లెందుకు తరలించారు.
అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య
Published Sun, Oct 20 2013 6:10 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
Advertisement
Advertisement